ప్రమాదాన్ని ఎప్పటికీ మరిచిపోను

సాయి ధరమ్ తేజ్..నిజ జీవితంలోనే మృత్యువు అంచు వరకు వెళ్లి, పోరాడి గెలిచి వచ్చిన హీరో. అసలు ఆసుప్రతి నుంచి బయటకు వస్తాడా అని అందరూ అనుమాన పడ్డారు. అలాంటిది వచ్చాడు. మళ్లీ హీరోగా…

సాయి ధరమ్ తేజ్..నిజ జీవితంలోనే మృత్యువు అంచు వరకు వెళ్లి, పోరాడి గెలిచి వచ్చిన హీరో. అసలు ఆసుప్రతి నుంచి బయటకు వస్తాడా అని అందరూ అనుమాన పడ్డారు. అలాంటిది వచ్చాడు. మళ్లీ హీరోగా నిలిచాడు. విరూపాక్ష అనే సినిమా చేసాడు. త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇంటర్వూ ఇచ్చాడు. తన ప్రమాదం తరువాత జరిగిన, గుర్తున్న సంగతులను ప్రస్తావించాడు కూడా.

తాను ఈ ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించడం లేదని, అది ఓ లెసన్ అని, ఓ స్వీట్ మెమరీ అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. దీని వల్ల చాలా నేర్చుకున్నా అని అన్నాడు. ముఖ్యంగా మాట విలువ తెలిసిందన్నాడు. అంతకు ముందు తాను చాటర్ బాక్స్ లా ఎక్కువ మాట్లాడే వాడినని, స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇదే తీరు అని వివరించాడు. కానీ ఒక్కసారి గొంతు పెగలక, మాట రానపుడు దాని విలువ తెలిసిందన్నాడు. అయితే ఇంట్లో వాళ్లు, తరువాత షూటింగ్ లో తొటి నటులు, మామయ్య పవన్ కళ్యాణ్ అంతా ధైర్యం నూరిపోసారన్నారు. తన మాట అర్థం కాకపోయినా, ఏదీ మళ్లీ చెప్పు..నెమ్మదిగా చెప్పు అని అడిగి మరీ అర్థం చేసుకునేవారన్నారు.

తన తల్లి తనకు ఎంతో ధైర్యం చెప్పిందని, మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరం..అని చెప్పి, బైక్ ఎక్కించిందని గుర్తు చేసుకున్నారు. తనకు ఎంత మంది ఆప్తులు వున్నారో, తన కోసం ఎంత మంది ప్రార్థించారో తెలిసిన తరువాత ఇది కదా తాను సంపాదించిన ఆస్తి అని అర్థం అయిందన్నారు.

ప్రమాదం తరువాత అన్నింటికన్నా కీలకంగా తెలుసుకున్నది ఏమిటంటే..’ఈ క్షణం బతకాలి..వర్తమానంలో బతకాలి..’ అన్నదే అని వివరించారు. అందుకే నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, అందరితో కలిసి మెలిసి వుంటూ, జీవితాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా అన్నారు. ప్రమాదం తరువాత కోలుకుని షూట్ కు వస్తే, ఏదో తొలిసారి కెమేరా ముందు నిల్చున్న ఫీల్ కలిగిందన్నారు. అన్నీ సెట్ కావడానికి రెండు రోజులు పట్టిందన్నారు.

ఇప్పుడు సినిమా ట్రెండ్ మారిందని, వైవిధ్యమైన సబ్జెక్ట్ లు అవసరం పడుతున్నాయని, అదృష్టం కొద్దీ తనకు ప్రమాదం జరగడానికి ముందే విరూపాక్ష కథ తన దగ్గరకు వచ్చిందని చెప్పారు. అది ఇప్పుడు ఈ టైమ్ కు పెర్ ఫెక్ట్ మూవీ అయిందన్నారు. చేతబడి లాంటి వైవిధ్యమైన అంశం నేపథ్యంలో జరిగే ప్రేమకథ విరూపాక్ష సినిమా లైన్ అని వివరించారు. తొలిసగం అంతా మాంచి లవ్ స్టోరీ, మలిసగం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా నడుస్తుందని అన్నారు.

విరూపాక్ష సినిమా చాలా బాగా వచ్చిందని, సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ గా వుంటుందని తేజు వివరించారు. మామయ్య పవన్ తో కలిసి సినిమా చేసే చాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదన్నారు. చేస్తే బాగుంటుందని మాత్రం అనుకున్నా అన్నారు. అలాంటిది కళ్యాణ్ మామయ్య, త్రివిక్రమ్ ఇద్దరూ చెప్పేసరికి ఒకంతట నమ్మలేకపోయా అన్నారు. ఓ సారి గిల్లండి అని త్రివిక్రమ్ ను అడిగా అన్నారు. ఎప్పటికైనా పెద్ద మామయ్య మెగాస్టార్ తో కూడా కలిసి సినిమా చేస్తా అనే నమ్మకం వుందన్నారు. మెగా హీరోలు అందరితో కూడా సినిమాలు చేయాలన్నది కోరిక అన్నారు.

ఇంట్లో టైమ్ దొరికితే లెగో బ్రిక్స్ తో ఆడుకుంటా అని, అది తన సరదా అని వివరించారు. తన దగ్గర దాదాపు ఓ లెగో షో రూమ్ నే వుందన్నారు.