టైటిల్: హీరో
రేటింగ్: 2.25/5
తారాగణం: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, సత్య, నరేష్, కౌశల్య, జగపతిబాబు, ప్రభాకర్, అజయ్, బ్రహ్మాజి తదితరులు
కెమెరా: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: గిబ్రన్
నిర్మాత: గల్ల అరుణకుమారి
దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య
విడుదల తేదీ: 15 జనవరి 2022
గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు “హీరో”గా తెర మీదకొస్తున్నాడంటే కొంత వరకు ఆసక్తి నెలకొనడం సహజం.
అయితే ఎంతో మంది నటవారసులు పుట్టుకొచ్చిన తెలుగు తెర మీద సత్తా ఉన్న వాళ్లే నిలబడ్డారు. ఆ సత్తా అనేది కేవలం నటన పరంగానే కాకుండా ఎంచుకునే చిత్రాలు, దర్శకుడి ప్రతిభ మొదలైన వాటి మీద ఎక్కువగా ఆధారపడుతుంది.
ఇంతకీ 'హీరో' విషయానికొస్తే ఎలా ఉందో చూద్దాం.
సినిమా మొదలవడంతోటే కృష్ణ తన తాతని, మహేష్ బాబు తన మావయ్యని చెట్టు పేరు చెప్పుకోవడం జరిగింది. మధ్యమధ్యలో ఇతను నటవారసుడని గుర్తు చేయడానికన్నట్టుగా కుదిరినప్పుడల్లా మహేష్ బాబు, కృష్ణ పాటలు కూడా వినిపించారు.
దర్శకుడు సీరియస్ కథని రాసుకుని దానిని సిల్లీగా తీయడానికి డిసైడ్ అయ్యాడు. అది కొంతవరకు రసాభాస అయ్యింది.
సరదాగా నడిచే కథకి సీరియస్ ఫ్లాష్ బ్యాక్ తోడవుతున్న సంకేతాలిచ్చి దానిని మరింత వెక్కిలిగా మలిచారు. ఇలాంటివి టీవీల్లో ఎదురుపడినప్పుడు కాసేపు పర్వాలేదనిపించొచ్చు తప్ప ఎంతో కొంత అంచనాలు పెట్టుకును వెళ్లినప్పుడు సినిమా హాల్లో భరించడం కష్టం.
అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో పాటలు పరమ వీక్. ఎప్పటిదో రజనీకాంత్ పాత పాట “ఆసై నూరు వగై” బీట్ ని యథాతథంగా లేపేసి హీరో ఇంట్రో సాంగ్ వినిపించాడు సంగీత దర్శకుడు. తర్వాత “బదన్ పె సితారె” అంటూ ఒరిజినల్ హిందీ సాంగ్, ఆ తర్వాత పాత పాటల సమాహారంగా ఒక డ్యాన్స్. ఇందులో సంగీత దర్శకుడి పనేమీ లేదు. మళ్లీ చివర్లో రోలింగ్ టైటిల్సప్పుడు సింబాలిక్ గా “బుర్ర పాడైపోతోందే..” అంటూ ముగించాడు.
టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్ బాగున్నాయి. వాటిని వంక పెట్టలేం కానీ దర్శకుడు హీరోని సకలకళావల్లభుడిగా చూపించాలన్న ప్రయత్నంలో ఆయాసపడ్డాడనిపించింది.
అన్నప్రాసన రోజునే ఆవకాయ అన్నట్టుగా ప్రతి అరంగేట్రం హీరోని కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్యాన్స్..అన్నీ చేసేయగలడని చూపించే ప్రయత్నం చాలా బరువైనది. నిర్మాతల కోరిక మేరకు ఆ మోత తప్పదనుకుంటే స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చెయ్యాలి.
పేపర్ మీద రాసుకున్న ప్రతీదీ సీన్ గా వర్కౌట్ కాకపోవచ్చు. ఆ జడ్జ్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి.
లైటర్ వీన్ పద్ధతిలో సినిమా తీయొచ్చు కానీ సీన్లు నమ్మశక్యంగా ఉండాలి కదా. చంపడానికొచ్చిన హార్డ్ కోర్ క్రిమినల్స్ కూడా జోకర్స్ లా బిహేవ్ చేయడం సినిమా కథలు చెప్పడం మొదలైనవి చిన్న పిల్లలకి నచ్చొచ్చేమో గానీ మెచ్యూర్ ఆడియన్స్ కి ఎక్కవు.
మహేష్ బాబు దూకుడు క్లైమాక్స్ టైపులో బ్రహ్మాజీని పెట్టి ఒక షూటింగ్ ఎపిసోడ్ చేసారు. అక్కడికి అందులో సోను సూద్ వచ్చినట్టు ఇక్కడ కూడా రియల్ డాన్ సలీం భాయ్ రావడం యాదృచ్ఛికం లాంటి స్ఫూర్తి అనుకోవచ్చు. అది కూడా బలవంతంగా అతికించినట్టుంది తప్ప ఒక ఆర్గానిక్ ఫ్లో లేదు.
ప్రధాన విలన్ సలీం భాయ్ పాత్ర చాలా పేలవంగా ఉంది. ఇంత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చేసి దానిని కామెడీగా ట్రీట్ చేసే కన్నా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా మలిచుంటే బాగుండేది.
నిర్మాణ విలువలు ఖర్చు రూపంలో తెర మీద ఎక్కువగానే కనపడ్డాయి. కానీ రొటీన్ హీరో మాదిరిగా కాకుండా కాస్తంత భిన్నంగా లాంచ్ చేసుంటే మంచి ప్రయత్నమయ్యుండేది.
మిడిల్ రేంజ్ హీరోలకే ఫార్ములా సినిమాకి హాలుకి జనాలు రాని పరిస్థితి నెలకొనుంది. మరి కొత్త హీరోతో రొటీన్ ఫార్ములా సినిమా తీస్తే ఫలితమెలా ఉంటుందో చెప్పక్కర్లేదు.
అశోక్ గల్లా తొలి చిత్రమైనా కాన్ ఫిడెంట్ గా కనిపించాడు. ఈజ్ ఉంది. డ్యాన్సుల్లో మరింత కృషి చేయొచ్చు. అయితే ఎంచుకునే కథలు, దర్శకులను బట్టే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది.
నిధి అగర్వాల్ గతం కంటే కాస్త బరువెక్కింది. కానీ ఇందులోని పాత్రలో మాత్రం బరువులేదు. కథలో రొమాన్స్ కి కానీ, ఎమోషన్ కి కానీ ఈమె ద్వారా పండే సన్నివేశాలేవీ పెద్దగా రాసుకోలేదు.
హీరో తల్లిగా చేసిన నటి బాగా చేసింది. నరేష్ మామూలే. జగపతి బాబుది పెద్ద పాత్రే గానీ ఎందుకో పెద్దగా ఇంపాక్ట్ కి గురిచేయలేదు. చాలాకాలం తర్వాత కౌశల్య హీరోయిన్ తల్లిగా కనిపించింది.
కామెడీగా మొదలై, థ్రిల్లర్ గా మారి, యాక్షన్ ఎపిసోడ్లతో కూడిన స్పూఫ్ చిత్రంగా ముగిసిన చిత్రమిది.
ఇలా నానారకాల జానర్స్ ఒకే చోట కలిపి కొడితే అదో రకం కలగాపులగం రుచిలా ఉంది. తలనొప్పి రాకపోయినా తలలోకి ఎక్కదు.
బాటం లైన్: కలగాపులగం