ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ సత్ఫలితాలు ఇస్తుందనే ఆశ, నమ్మకం టాలీవుడ్‌లో ఉంది. అంతేకాదు, జగన్‌తో భేటీ తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఎంతో సంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఇందుకు బలం కలిగిస్తోంది. త్వరలో మళ్లీ ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ ప్రముఖుల మధ్య భేటీ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్‌తో చిరంజీవి భేటీపై మరోసారి అగ్రహీరో నాగార్జున స్పందించారు. బంగార్రాజు మూవీ సక్సెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ సంక్రాంతికి విడుదలైన తన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళుతోందన్నారు. ఇదే సందర్భంలో జగన్, చిరు భేటీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి వెళ్లారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చిరు, నాగార్జున మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. సీఎం జగన్‌తో లంచ్ భేటీకి తనను కూడా చిరంజీవి ఆహ్వానించారని రెండు రోజుల క్రితం నాగార్జున చెప్పడం తెలిసిందే. అయితే తన సినిమా విడుదలవుతుండడంతో ప్రమోషన్స్ ఇతరత్రా పనుల వల్ల చిరుతో వెళ్లలేకపోయినట్టు నాగార్జున ప్రకటించారు.
ఇవాళ బంగార్రాజు సినిమా సక్సెస్ మీట్‌లో మరోసారి సీఎంతో చిరంజీవి భేటీపై నాగార్జున మాట్లాడుతూ అంతా మంచే జరుగుతుందనడం గమనార్హం.