మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ ఇస్తుందనే ప్రచారంపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. జగన్‌తో లంచ్ భేటీపై ప్రధాన ప్రతిపక్షం వ్యూహాత్మకంగా దుష్ప్రచారం మొదలెట్టింది.
ఇందులో భాగంగానే చిరుకు రాజ్యసభ ఇస్తారనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రచారాన్ని చిరంజీవి గట్టిగా తిప్పికొట్టారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అలాగే రాజ్యసభ ఇస్తారనే ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి తిరిగి రాజకీయ ప్రవేశంపై జగన్ కేబినెట్లోని మంత్రి బాలినేని మాట్లాడ్డం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం చిత్ర పరిశ్రమ ఇబ్బందుల గురించి చర్చించడానికి మాత్రమే సీఎంతో చిరు భేటీ అయ్యారన్నారు. ఇందులో రాజకీయ ప్రస్తావనే లేదన్నారు.
కొంత మంది ఉద్దేశపూర్వకంగానే జగన్, చిరు భేటీని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్ల తరపున వచ్చి చిరంజీవి కలిస్తే ఏదో ఒకటి పులమాలని చూస్తున్నారని బాలినేని మండిపడ్డారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కు ఎంత మాత్రం లేదని మంత్రి బాలినేని తేల్చిచెప్పారు.
పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితులు, కాపుల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతుంటారని బాలినేని ఆరోపించారు.