యూపీలో భారతీయ జనతా పార్టీకి వరస ఝలక్ లు తగులుతూ ఉన్నాయి. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. అయితే యూపీలో ఎస్పీనే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయింది. ఎస్పీకి కాంగ్రెస్ తో పొత్తు లేదు. బీఎస్పీ ఊసులో కనిపించడం లేదు. ఏతావాతా యూపీలో బీజేపీ వర్సెస్ ఎస్పీ ముఖాముఖి పోరు సాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
సమాజ్ వాదీని బీజేపీ వాళ్లు తక్కువ అంచనా వేశారు. మత రాజకీయంతో యూపీలో కమల వికాసం సుసాధ్యంగానే కనిపించింది. అయితే ఓబీసీ, దళిత నినాదంతో సమాజ్ వాదీ పార్టీ ఇప్పుడు ఉన్నట్టుండి ఊపులోకి వచ్చింది.
వాస్తవానికి ఈ సారి యూపీలో సమాజ్ వాదీ పార్టీకి నూటాయాభై వరకూ సీట్లు దక్కవచ్చని ప్రీ పోల్ సర్వేలు వేసినప్పుడే, గేమ్ మారుతోందని స్పష్టం అయ్యింది. యాభై అసెంబ్లీ సీట్ల స్థాయిలో ఉన్న ఎస్పీ నూటా యాభై రేంజ్ కు వస్తుందనే అంచనాలు.. ఆ పార్టీ పుంజుకుంటోందనే సంకేతాలను బలంగా ఇచ్చాయి.భారీ వేవ్ లో గెలిచిన బీజేపీ ఈ సారి స్వల్ప మెజారిటీతో బయటపడొచ్చనే విశ్లేషణలు కూడా ఉత్తుత్తువే అనుకోవాలి. ఎందుకంటే.. వేవ్ లో గెలిచిన పార్టీ గెలిస్తే మళ్లీ వేవే, బోటాబోటీగా బయటపడుతుందనే విశ్లేషణలు ఇలాంటి విజయాల విషయంలో వర్తించవు.
కేంద్రంలో మోడీ సర్కారు 2014, 2019 ల్లో సాధించిన వరస విజయాలు, ఢిల్లీలో ఆప్ విక్టరీ.. ఇవన్నీ క్లీన్ స్వీప్ తరహా విజయాలు. మొదటి సారి వేవ్ వచ్చింది, రెండోసారీ అదే స్థాయి విజయం. అంతే కానీ.. రెండో సారి ప్రజలు బోటాబోటీగా గెలిపించలేదు. యూపీలో అయినా ఇంతే. బీజేపీ గెలిస్తే.. 2017 స్థాయి విజయమే నమోదు కావాలి. అంతే కానీ.. బీజేపీ అనుకూల మీడియా చెబుతున్నట్టుగా స్వల్ప మెజారిటీ అనేది ఉత్తుత్తి విశ్లేషణ.
ఈ సంగతలా ఉంటే… బీజేపీ తన తొలి జాబితాను రెడీ చేసిందట. నేడో రేపో.. ఆ జాబితాను విడుదల చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రధాన విశేషం ఏమిటంటే.. ఈ సారి చాలా మంది సిట్టింగులను బీజేపీ పక్కన పెడుతుందని ఇది వరకే వార్తలు వచ్చాయి. మరి ఫస్ట్ లిస్టులో అలాంటి మార్పులే జరిగితే, అసంతృప్తులు భారీగా తయారవుతారని వేరే చెప్పనక్కర్లేదు.
మూడు వందల మంది సిట్టింగుల్లో వంద మందిని బీజేపీ పక్కన పెడుతుందనే మాట చాన్నాళ్లుగా వినిపిస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. ఫస్ట్ లిస్టు లోనే కనీసం ముప్పై మంది సిట్టింగులకు ఝలక్ తగలాలి. ఇప్పటికే వరస రాజీనామాలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీకే బద్ధులైన సిట్టింగులను కూడా పక్కన పెట్టే తరహాలో జాబితా విడుదల అయితే.. అది రాజకీయంగా మరింత రచ్చకు కారణం కావొచ్చు.