యూపీలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి రాజకీయంగా దెబ్బ పడితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక రకంగా కౌంట్ డౌన్ మొదలైనట్టే అని వేరే చెప్పనక్కర్లేదు. 90 శాతం లోక్ సభ సీట్లను బీజేపీకి కట్టబెట్టి… కేంద్రంలో ఆ పార్టీని గెలిపి నిలుపుతున్న రాష్ట్రాల్లో యూపీ మొదటి వరసలో, మొదటి నంబర్ లో ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ఊపుకు అనుగుణంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2017లో బీజేపీ బంపర్ విక్టరీని సాధించింది.
ఇక ఎన్నికలకు రెడీ అయిన యూపీలో ఇప్పుడు బీజేపీకి వరస ఝలక్ లు తగులుతున్నాయి. వరస పెట్టి నేతలు బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీ వైపు సాగుతున్నారు. ఈ పరిణామాన్ని తగ్గించి చూపేందుకు భక్తులు సరి కొత్త వాదనను రెడీ చేశారు. ఈ విషయంలో వాట్సాప్ యూనివర్సిటీ సదా సిద్ధంగా ఉంటుంది కాబట్టి, వాట్సాప్ యూనివర్సిటీ లో పాలిటిక్స్ లో పీహెచ్డీలు చేసిన భక్తులు.. యూపీ రాజకీయ పరిణామాలను బెంగాల్ తో పోలుస్తున్నారు.
బెంగాల్ లో బీజేపీకి అధికారం దక్కుతుందంటూ అనుకూల మీడియా ప్రచారం చేసిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వరసగా కమలం పార్టీ వైపు వలసలు సాగాయి. టీఎంసీలో నంబర్ టు, నంబర్ త్రీ స్థాయి నేతలతో మొదలుపెడితే, అనేక మంది మమతకు గుడ్ బై చెప్పి, బీజేపీకి జై కొట్టారు. బెంగాల్ ఎన్నికలకు ముందు టీఎంసీ టు బీజేపీ భారీ ఎత్తున వలసలు సాగాయి.
ఆ వలసలతో మమత పని అయిపోయిందని అనిపించినా, ప్రజలు మాత్రం ఆమెకే పట్టం కట్టారు. మరోసారి సీఎంగా ఆమెకే అవకాశం ఇచ్చారు. తద్వారా రాజకీయ నేతల వలసలు ప్రజలను ప్రభావితం చేయవని స్పష్టం అయ్యింది. ఆ ఉదాహరణనే ఇప్పుడు భక్తులు ప్రస్తావిస్తున్నారు.
బెంగాల్ లో బుక్ అయ్యింది బీజేపీనే అయినా, యూపీలో బీజేపీని నేతలు వరసగా వీడుతున్న నేపథ్యంలో.. బెంగాల్ లో ఏమయ్యిందో తెలుసు కదా.. అంటూ వాదిస్తున్నారు! అయితే.. భక్తులు తమ కన్వీన్సింగ్ వాదనలు వినిపించడం బాగానే ఉంది కానీ, బెంగాల్ పరిణామాలకూ, యూపీ పరిణామాలకూ చాలా తేడా ఉంది.
అందులో ముఖ్యమైనది..బెంగాల్ లో బీజేపీ జెండా పాతుతుందని ఎన్నికలకు ముందు మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ఊదరగొట్టింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీకి భారీగా లోక్ సభ సీట్లు దక్కడం, మమత పదేళ్ల పాలనను పూర్తి చేసుకోవడం, దేశంలో ఉన్న మోడీ గాలి.. వీటన్నింటి ఫలితంగా బెంగాల్ లో బీజేపీ జెండా పాతుతుందనే ప్రచారం గట్టిగా సాగింది. ఈ ప్రచారానికి మమత పక్కన నిలబడిన వారే భయపడ్డారు! టీఎంసీ పని అయిపోయిందని లెక్కలేశారు. దీంతో వరస పెట్టి బీజేపీ వైపు గెంతారు. మోడీ, షాల పోల్ మేనేజ్ మెంట్ గురించి ఊహించుకుని టీఎంసీ తరఫున నిలబడానికి వీరు భయపడ్డారు.
ఇక యూపీ విషయానికి వస్తే.. ఇప్పుడు కూడా ఎస్పీ అధికారంలోకి వచ్చేస్తుందని ఏ ఒక్క మీడియా సంస్థా చెప్పడం లేదు! యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి వరకూ వెల్లడైన ఏ ఒక్క సర్వే కూడా ఎస్పీకి నూటా యాభై లోపు సీట్లనే చూపుతున్నాయి. మరోసారి అధికారం బీజేపీకే దక్కుతుందని వందకు వంద శాతం సర్వేలూ చెబుతున్నాయి!
అందులోనూ యోగి ఆదిత్య నాథ్ కేవలం ఐదేళ్ల పదవీ కాలాన్ని మాత్రమే పూర్తి చేసుకున్నారు. ఆయన ప్రభుత్వంపై విపరీత వ్యతిరేకతను ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయకూడదు. ఇక కేంద్రంలో కమలం అధికారంలో ఉండటం.. బెంగాల్ లో టీఎంసీ టు బీజేపీ వలసలకు ప్రధాన కారణం! మరి ఎస్పీ ఎక్కడ అధికారంలో ఉంది? ఎస్పీకి ఏకైక పెద్ద దిక్కు అఖిలేష్ యాదవ్ మాత్రమే!
ములాయం యాక్టివ్ గా లేడు, అమర్ సింగ్ లాంటి వ్యూహకర్తో, లాబీయిస్టో కూడా లేడు! అంతా అఖిలేషే. బెంగాల్ ఎన్నికల ముందు అక్కడి బీజేపీకి, యూపీ ఎన్నికల ముందు ఎస్పీకి చాలా తేడా ఉంది. మీడియా భజంత్రీలు కానీ, కేంద్ర నాయకత్వం కానీ.. ఏదీ ఎస్పీకి లేదిప్పుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ లో బీజేపీ వైపు సాగిన వలసలకూ, ఇప్పుడు ఎస్పీ వైపు సాగుతున్న వలసలకూ పోలిక ఎలా ఉన్నట్టు? ఇలాంటి అసంబద్ధమైన వాదనలతోనే వాట్సాప్ యూనివర్సిటీ విసిగెత్తించింది. దాని తీరు ఇప్పటికీ మారడం లేదు!