వాస్తవానికి సోమవారమే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయాల్సింది. ఆ రోజున ఆప్ శ్రేణులు భారీ ర్యాలీతో ఢిల్లీ సీఎంను నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ ర్యాలీ భారీ స్థాయిలో ఉండటంతో, అది సకాలంలో ముందుకు సాగడం కష్టంగా మారిందట. దీంతో సాయంత్రానికి కానీ కేజ్రీవాల్ నామినేషన్ కేంద్రాన్ని చేరుకోలేకపోయారు. దీంతో నామినేషన్ ఆ రోజు దాఖలు చేయలేదు. అయితే మంగళవారం నామినేషన్లకు తుదిగడువు.
ఆ రోజున కేజ్రీవాల్ నామినేషన్ వేస్తారని ఆప్ ప్రకటించింది. దీంతో తుదిగడువు రోజున కేజ్రీవాల్ ను ఆయన ప్రత్యర్థులు ప్రత్యేకంగా టార్గెట్ గా చేసుకున్నట్టుగా ఉన్నారు. అదెలా అంటే.. కేజ్రీవాల్ అసలు నామినేషన్ దాఖలు చేస్తారా? అనేది కూడా అనుమానంగా మారేట్టుగా!
మంగళవారం నామినేషన్లకు తుదిగడువు నేపథ్యంలో కేజ్రీవాల్ అక్కడకు చేరుతున్నారు. అయితే అప్పటికే చాలా మంది ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీల వాళ్లు నామినేషన్లు వేయడానికి అంటూ అక్కడకు చేరారు. వారు కేజ్రీవాల్ కన్నా ముందే అక్కడకు చేరడంతో.. ఆయన వెనుకబడ్డారు. తోపులాట జరగకుండా అధికారులు టోకెన్ సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ లో కేజ్రీవాల్ కు నంబర్ 45 దక్కింది!
ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి అంటూ వెళ్లి గంట వరకూ బయటకు రాకపోవడంతో..అసలు ఈ టోకెన్ నంబర్ 45కు టైమ్ దక్కుతుందా అనేది కూడా అనుమానంగా మారింది ఒక దశలో. అయితే ఎట్టకేలకూ సాయంత్రం ఆరున్నరకు కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయగలిగినట్టుగా తెలుస్తోంది. ఇలా చివరి రోజున నామినేషన్ విషయంలో ఢిల్లీ సీఎం టెన్షన్ పడ్డారని సమాచారం. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆప్ ఆరోపిస్తూ ఉంది.