“ఢిల్లీ వెళ్తున్నా.. రాజధానిని అమరావతి నుంచి కదలనివ్వను” బీజేపీతో పొత్తుపెట్టుకున్న పవన్ కల్యాణ్ తాజా స్టేట్ మెంట్ ఇది.
“రాజధానిని మార్చాలంటే కేంద్రం అనుమతి కోరాల్సిందే”.. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట ఇది.
“రాజధానిని మారిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు”.. తాజాగా బీజేపీలో చేరిన సుజనా చౌదరి మాటిది.
ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. దాదాపు బీజేపీ, జనసేన, టీడీపీకి చెందిన చాలామంది నేతలు ఇదే మాటను పదేపదే చెబుతున్నారు. ఇంతకీ వీళ్లంతా చెబుతున్నట్టు జగన్ తీసుకున్న పాలన వికేంద్రీకరణపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా..? రాజ్యాంగపరంగా కేంద్రానికి ఆ అధికారం ఉందా? ఒకవేళ నిజంగా రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి ఆ అధికారం ఉందనుకుంటే.. నైతికంగా వద్దని చెప్పే హక్కు కేంద్రానికి ఉందా?
నిపుణులు చెప్పే మాట..
రాజధాని అంశానికి సంబంధించి కేంద్రం, రాష్ట్రంపై అజమాయిషీ చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు మాత్రం చేయగలదు. వాటిని పాటించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజధానిని ఎక్కడ ఏర్పాటుచేసుకోవాలి, ఎక్కడ్నుంచి పరిపాలన సాగించాలనే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోకి, రాష్ట్రాల హక్కుల్లోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం కోరిక కేంద్రం ఈ విషయంలో సహాయసహకారాలు అందిస్తుంది. అవసరమైతే “రాష్ట్ర ప్రభుత్వం విన్నపం” మేరకు రాజధాని అంశంపై కమిటీ కూడా వేయగలదు కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం మాత్రమే ఇస్తుంది. కావాలంటే నిధులు కావాలని కోరవచ్చు. మంజూరు చేయాలా వద్దా అనేది కేంద్రం ఇష్టం.
రాజకీయ నాయకులు చెప్పే మాట..
సరిగ్గా ఇక్కడే రాజకీయ నాయకులు కొర్రీలు పెడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్రానికి నిధులు రావు. మరీ ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించిన (విభజన చట్టం ప్రకారం) నిధుల్ని కేంద్రం నిలుపుదల చేసే అవకాశం ఉంది. కానీ ఈ విషయాన్ని బీజేపీ-టీడీపీ నేతలు బయటకు చెప్పడం లేదు. కేంద్రం అనుమతితో మాత్రమే రాజధానిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెల్లదని వితండవాదం చేస్తున్నారు.
మూడు రాజధానులు ఏర్పాటుచేస్తే, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని.. నిధులు కేటాయించదనే విషయాన్ని స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు బయటకు చెప్పలేరు. అలా చెబితే రాజకీయంగా వాళ్ల గొయ్యి వాళ్లు తవ్వుకున్నట్టే. అందుకే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంశాన్ని కేంద్రానికి ఆపాదించే ప్రయత్నం జరుగుతోంది.
రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట…
ఇక రాజకీయ విశ్లేషకులు చెప్పే మాటల విషయానికొద్దాం. వీళ్లంతా ఈ విషయంలో చాలా లాజికల్ గా స్పందిస్తున్నారు. వైసీపీపై కేంద్రానికి సాఫ్ట్ కార్నర్ ఉంటే ఈ 3 రాజధానుల అంశాన్ని పూర్తిగా అది చూసీచూడనట్టు వదిలేస్తుంది. ఇక్కడ రాజ్యాంగం, నిబంధనలు లాంటి అంశాలు కేంద్రానికి అస్సలు గుర్తుకురావు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ ఇలానే వ్యవహరించింది.
మరికొందరు విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే.. గతంలో రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా చంద్రబాబు నియంత్రించినప్పుడు కేంద్రం పెద్దగా కలుగజేసుకోలేదని, 3 రాజధానుల అంశం కూడా దాదాపు ఇలాంటిదేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా అమరావతిని రాజధానిగా చేసినప్పుడు ఎలాంటి నిధులు ఇవ్వని కేంద్రానికి ఇప్పుడు మూడు రాజధానుల అంశంపై ప్రశ్నించే నైతిక హక్కు లేదని అంటున్నారు.
మొత్తంగా వీళ్లందరి అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకుంటే ఒక విషయం మాత్రం స్పష్టమౌతోంది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. కానీ అదే రాజధానికి నిధులు కేటాయించే అంశం పూర్తిగా కేంద్రానికి సంబంధించిన అంశం. సో.. ఈ కోణంలో ఏపీ రాజధానులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.