ఇండస్ట్రీలో అంతే. ఒకసారి ముద్ర పడిందంటే ఇక ఆ ఇమేజ్ ను తొలిగించుకోవడం చాలా కష్టం. ఇక శాటిలైట్ సెగ్మెంట్ లోనైతే చెప్పనక్కర్లేదు. ఉన్నవే 3 ఛానెళ్లు. అలాంటి ఛానెళ్ల వద్ద కూడా పిచ్చి వేషాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఓ “వ్యక్తి” విషయంలో అదే జరుగుతోంది.
ఇండస్ట్రీలో అతడికి మంచి పట్టు ఉంది. కాంబినేషన్లు బాగా సెట్ చేస్తాడనే ఇమేజ్ ఉంది. ఒకప్పుడు కొన్ని సినిమాలకు డైలాగులు కూడా రాసి పాపులర్ అయ్యాడతను. తర్వాత చాలా సినిమాలకు తెరవెనక పనిచేయడం, అనధికారిక సహ-నిర్మాతగా వ్యవహరించడం లాంటి పనులు చేశాడు. ఈ క్రమంలో శాటిలైట్ బిజినెస్ దగ్గరకొచ్చేసరికి మాత్రం తనలోని మరో “కోణాన్ని” చూపించాడు.
ఎగ్రిమెంట్ డాక్యుమెంట్లు మార్చడం, తనదే సైన్ అథారిటీ అంటూ నమ్మించడం, నిర్మాతకు తను ఎంత చెబితే అంత అంటూ ఛానెల్ వాళ్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకోవడం లాంటి పనులు చేశాడు. ఫలితంగా ఆ ఛానెళ్లు కొన్ని ఇబ్బందులు పడ్డాయి. కొన్ని లీగల్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా సదరు వ్యక్తి బాగానే వెనకేశాడని టాక్.
దీంతో ఆ ఛానెళ్ల దృష్టిలో ఇతడు బ్యాడ్ అయిపోయాడు. ఎంతలా అంటే ఏదైనా ప్రాజెక్టులో ఇతడి ప్రమేయం ఉందని తెలిస్తే, వెంటనే ఆ ప్రాజెక్టును పక్కనపెడుతున్నాయి ఛానెళ్లు. తాజాగా ఓ సినిమా కూడా ఇతగాడి చేతివాటం కారణంగా శాటిలైట్ కు నోచుకోలేదు. కాస్త భారీగా వస్తున్న ఆ సినిమా వాయిదా పడ్డానికి ఇది కూడా ఓ కారణం. ప్రస్తుతానికైతే పరిశ్రమలో అతడి హవా అంతోఇంతో నడుస్తోంది. కానీ అది ఎక్కువ రోజులు సాగకపోవచ్చు.