కొంప ముంచావ్ చిరు.. జనసైనికుల్లో నైరాశ్యం

ఏపీలో కాపు రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాపులంతా పార్టీ పెడతారని, అందుకే మీటింగ్ పెట్టుకున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ కాపు పార్టీ వెనక సీఎం జగన్ ఉన్నారని, జనసేనకి కాపు ఓట్లు వెళ్లిపోకుండా…

ఏపీలో కాపు రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాపులంతా పార్టీ పెడతారని, అందుకే మీటింగ్ పెట్టుకున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ కాపు పార్టీ వెనక సీఎం జగన్ ఉన్నారని, జనసేనకి కాపు ఓట్లు వెళ్లిపోకుండా కొత్త పార్టీ పెట్టి ఆ ఓట్లను చీల్చబోతున్నారని కూడా వైరి వర్గాలు ఉడుక్కున్నాయి. 

ఆ సంగతి అక్కడితో ఆగిపోయింది, ఆ తర్వాత వేడి చల్లారిపోయింది. ఈలోగా ఇటీవల చిరంజీవి తమ్ముడు పవన్ కి సపోర్ట్ గా మాట్లాడటంతో.. చిరంజీవిపై జనసైనికులు ఆశలు పెట్టుకున్నారు. అన్నయ్య తమకి తోడు వస్తారని, 2024 ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తారని ఆశించారు. కానీ ఇప్పుడా ఆశలు గల్లంతయ్యాయి.

జనసైనికుల్లో నిరాశ..

జనసేన పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి నేరుగా జనసేన రాజకీయాల్లో వేలు పెట్టలేదు. కనీసం తన మద్దతు కూడా తెలపలేదు. పవన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా చిరంజీవి ప్రచారానికి రాలేదు. 

పవన్ రెండు చోట్లా గెలిచేస్తారనే నమ్మకంతోనే చిరంజీవి రాలేదని అనుకున్నా.. కనీసం తమ్ముడి రాజకీయాలకు అన్న మాట సాయం కూడా చేయరా అనే సెటైర్లు పడ్డాయి. ఆ తర్వాత నాగబాబు కూడా క్రమక్రమంగా జనసేనకు దూరమయ్యారు. తమ్ముడు పవన్ ఒంటరిగానే నిలబడ్డారు.

వైసీపీతో పాటు అందరికీ దూరం..

చిరంజీవి, సీఎం జగన్ భేటీ తర్వాత వైసీపీ తరపున చిరు రాజ్యసభకు వెళ్తారనే వార్తలొచ్చాయి. వాటిని ఖండించే క్రమంలో చిరంజీవి అసలు తాను రాజకీయాలకే దూరం అన్నారు. ఇప్పుడు దూరం చెప్పి, రెండేళ్ల తర్వాత జనసేనకు దగ్గర అని చెప్పలేరు చిరంజీవి. అంటే తనపై ఆశలు పెట్టుకున్న జనసైనికులకు కూడా చిరు ఓ క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో 2024 ఎన్నికల్లో చిరు ఎంట్రీపై ఆశపడ్డ వీరాభిమానులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. ఏపీలో చిరు లేకుండా కాపుల ఐక్యత సాధ్యమయ్యే పని కాదు కాబట్టి.. కాపులు పార్టీ పెట్టడం, అధికారం చేపట్టడం అనేది కూడా సుదూర స్వప్నమే.