రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అయినా కరోనా సోకిందా, లేక కరోనా సోకినా మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయా… ఇలాంటి పరిస్థితుల్లో ఎడాపెడా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ను ఎడా పెడా.. వాడేయొద్దు అంటున్నారు వైద్య శాస్త్ర నిపుణులు.
థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య విపరీతంగా వస్తూ ఉంది. పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటిపోయింది. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చనే అంచనాలూ ఉన్నాయి. ప్రభుత్వాలు పెద్దగా ఆంక్షలను అమలు చేయడం లేదు. రోజుకు రెండున్నర లక్షల స్థాయి కేసులు వస్తున్నా.. మాస్కులూ గట్రా జాగ్రత్త చర్యలను ప్రజలు పెద్దగా తీసుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో.. కరోనా సోకినా మరీ హైరానా పడిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. మైల్డ్ సింప్టమ్స్ అయితే… ఆసుపత్రులకు క్యూ కట్టి, అక్కడ వ్యాపారం కోసం ఎడాపెడా రాసే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ను వాడేయొద్దని నిపుణులు చెబుతున్నారు.
రెండో వేవ్ సమయంలోనే.. విపరీతంగా స్టెరాయిడ్ల వాడకం జరిగింది. కరోనా పేషెంట్లపై ట్యాబ్లెట్ల రూపంలోని స్టెరాయిడ్ల ప్రయోగాలు జరిగాయి. చాలా తక్కువ పరిమాణంలోని ట్యాబెట్ల రూపంలోని స్టెరాయిడ్లు కరోనాను నియంత్రించడం ఏమో కానీ, శరీరంపై మాత్రం రకరకాల ప్రభావాలను చూపిస్తాయని అప్పట్లోనే వైద్య నిపుణులు అందోళన వ్యక్తం చేశారు.
అయితే కరోనా పేషెంట్లు ఆసుపత్రులకు క్యూ కట్టిన ఆ తరుణంలో వైద్యులు ఎడాపెడా స్టెరాయిడ్లను రాసేశారు. దీన్ని విచక్షణ రాహిత్యం అనాలో, వ్యాపారం అనాలో, ముందస్తు జాగ్రత్త అనాలో కానీ.. రెండో వేవ్ లో ఆసుపత్రులకు వెళ్లిన వారిపై స్టెరాయిడ్స్ ప్రయోగాలు విపరీతంగా జరిగాయి.
ఇప్పుడు మూడో వేవ్ నేపథ్యంలో వైద్య నిపుణుల.. కరోనాకు గురైన వారు తమకు రాసిన మందుల విషయంలో అవగాహనను పెంపొందించుకోవాలని చెబుతున్నారు. మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వారు పారాసిటమల్ తో సరిపెట్టుకోవాలని, భయపడిపోయి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ట్యాబ్లెట్లను ఎడాపెడా వాడొద్దని సూచిస్తున్నారు.