వచ్చే దఫా లోక్ సభ ఎన్నికలతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపి తీరాలనేది బీజేపీ ఆలోచన. ప్రతిసారి లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం… ఏడాదో, రెండేళ్ల తర్వాత అదే రాష్ట్రంలో అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బొక్కబోర్లా పడటం బీజేపీకి అలవాటుగా మారింది.
దీంతో రాష్ట్రాల్లో పాగా వేయాలంటే లోక్ సభతో పాటే అసెంబ్లీ ఓటు కూడా పడితే తమకి అధికారం, లేదా అధికారంలో భాగస్వామ్యం అయినా దక్కుతుందనేది బీజేపీ ఆలోచన.
జమిలిపై బీజేపీతో పాటు.. చంద్రబాబు కూడా బాగానే ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం జమిలికి సై అంటే.. ఏపీలో ఐదేళ్ల కంటే ముందే ఎన్నికలొస్తాయనేది బాబు భ్రమ. అయితే ఇప్పుడు బాబుతో పాటు.. ప్రధాని మోదీకి కూడా జమిలిపై ఉన్న భ్రమలు దాదాపు తొలగిపోయినట్టే. బీహార్ లో రాబోయే ఫలితాలే దీనికి తొలిమెట్టుగా భావిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి బీహార్ లో ఎన్డీఏ కూటమికి పరాభవం తప్పదని తేలిపోయింది. అంటే బీహార్ లో అధికార కూటమిగా పోటీ చేసినా కూడా బీజేపీకి లాభం లేదని అర్థమైంది.
స్థానిక సమస్యలు వేరు, జాతీయ సమస్యలు వేరు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహన తోటే.. రెండు దఫాలుగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తోంది.
అదే ఊపులో గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయ ఢంకా మోగించింది. మొత్తం 40 లోక్ సభ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 39 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది.
అయితే ఆ తర్వాత ఏడాదికే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సగం సీట్లు కూడా తెచ్చుకోలేక ఓటమి అంచున నిలబడిందని సర్వేలు చెబుతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఎన్డీఏ కూటమి 80 నుంచి 100 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందంటున్నాయి సర్వేలు.
ఏడాదిలోనే ఎంత మార్పు అనే కంటే.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ప్రజలు వేర్వేరుగా చూస్తున్నారనే విషయాన్ని నాయకులు అర్థం చేసుకుంటే మంచిది. ఇదే ఊపులో జమిలి ఎన్నికలకు వెళ్తే.. అసెంబ్లీ సంగతి అటుంచితే ఎన్డీఏకి 39 లోక్ సభ స్థానాలు దక్కి ఉండేవా అనేది సందేహమే. అంటే జమిలికి వెళ్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందనేది స్పష్టమవుతోంది.
2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అంటే జమిలిపై బీజేపీ ఆలోచన తప్పు అని తేలిపోయింది. వీలైతే.. లోక్ సభ ఎన్నికలు జరిగే సమయానికి ఇంకే రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరక్కుండా ఉండటమే బీజేపీకి లాభదాయకంగా కనిపిస్తోంది.