థర్డ్ వేవ్ ప్రభావం.. పిల్లలకు మరిన్ని శెలవులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మూడో వేవ్ మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, కాస్త ముందే పిల్లలకు సంక్రాంతి సెలవులిచ్చారు. 8వ…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మూడో వేవ్ మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, కాస్త ముందే పిల్లలకు సంక్రాంతి సెలవులిచ్చారు. 8వ తేదీ నుంచి తెలంగాణలో శెలవులు మొదలయ్యాయి. రేపటితో ముగుస్తున్నాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు తెరవాల్సి ఉంటుంది.

ఓవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ, మరోసారి పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదముంది. ఇదే విషయాన్ని వైద్యారోగ్య శాఖ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలల శెలవుల్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, మరో 3 రోజులు సంక్రాంతి శెలవుల్ని కొనసాగించే అవకాశం ఉంది.

ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు తిరిగి తెరిచే అంశంపై కూడా 20వరకు వేచి చూసే ధోరణిలో తెలంగాణ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా ప్రత్యక్ష తరగతులు కాకుండా.. మరోసారి ఆన్ లైన్ విధానంలో తరగతులు కొనసాగించాలని భావిస్తోంది.

సంక్రాంతి కోసం ఇప్పటికే చాలామంది తమ ఊళ్లకు వెళ్లారు. శెలవుల్ని పొడిగించే అంశంపై త్వరగా ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తే, అలాంటి వాళ్లంతా తమతమ ఇళ్లల్లోనే కొన్నాళ్ల పాటు ఉంటారు. ఇలా ముందస్తుగా నిర్ణయాన్ని వెల్లడించడం వల్ల అనవసర ప్రయాణాల్ని నిరోధించి వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

మొత్తమ్మీద థర్డ్ వేవ్ ప్రభావంతో తెలంగాణలో విద్యా సంస్థలపై ఆ ప్రభావం మరోసారి గట్టిగా పడేలా ఉంది. మరీ ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారంటూ అంతర్జాతీయంగా సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో.. మరోసారి పాఠశాలలు మూతపడేలా ఉన్నాయి. ఈరోజు లేదా రేపటి లోగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోబోతోంది.