జగన్ సతీమణిని ఇలా కూడా హైలెట్ చేయాలా..?

ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం దంపతులిద్దరూ ఇలా ప్రభుత్వం తరపున పండగ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. ఇక పచ్చ మీడియా ఊరుకుంటుందా.. జగన్…

ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం దంపతులిద్దరూ ఇలా ప్రభుత్వం తరపున పండగ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. ఇక పచ్చ మీడియా ఊరుకుంటుందా.. జగన్ సతీమణి రాకను కూడా భూతద్దంలో చూస్తోంది. అడ్డదిడ్డమైన కథనాలు వండి వారుస్తోంది.

తిరుమల విషయంలో గొడవ..

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం దంపతులు.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ, అయితే జగన్ మాత్రం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఒంటరిగానే వచ్చేవారు. దీనిపై అప్పట్లో పెద్ద రాద్ధాంతం చేశాయి ప్రతిపక్షాలు. సతీమణిని తీసుకు రాకుండా జగన్ ఒక్కరే రావడాన్ని తప్పుబట్టారు. కానీ వేదపండితులు సమర్థించడంతో విమర్శకులు నోరు మూసుకున్నారు.

మతపరంగా టార్గెట్..

మతం కారణంగా చూపి జగన్ ని టార్గెట్ చేయడానికి గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆలయాలపై దాడులు సమయంలో జగన్ అన్య మతాలకు మద్దతుగా ఉన్నారంటూ బీజేపీ రచ్చ చేసింది, పనిలో పనిగా చంద్రబాబు కూడా వత్తాసు పలికారు. ఈ క్రమంలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరు కావడం ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. దీంతో జగన్ సతీమణి రాకపై కూడా రాద్ధాంతం చేస్తూ వార్తల్ని వండివారుస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల వ్యవహారంతో జగన్ అలర్ట్ అయ్యారని, అందుకే సంక్రాంతికి తన సతీమణిని కూడా సంబరాలకు తీసుకొచ్చారని కామెంట్లు విసురుతున్నారు. జగన్ ఏది చేసినా దాన్ని భూతద్దంలో చూపించడం వీరికి అలవాటైంది. భార్యతో కలసి రాకున్నా అది వార్తే, వచ్చినా అది వారికి వార్తే అన్నట్టుగా మారిపోయింది. మొత్తమ్మీద జగన్ పై విమర్శలు చేయడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వదులుకోవడం లేదన్నది నిజం.