ఏపీలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ అంశం పూర్తిగా మరుగున పడిపోవడం గమనార్హం. రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాకా.. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆశించారు. అంతకు ముందే దీనికి సంబంధించి వారి ప్రయత్నాలు జరిగాయి. అయితే.. ఆ సమయం గడిచినా.. ఇప్పటి వరకూ మళ్లీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ అంశం కదలకపోవడం గమనార్హం.
అంతా సవ్యంగా ఉండి ఉంటే.. ఈ పాటికి ఏపీలో మంత్రివర్గం మారేదేనేమో! అయితే వరసగా రెండేళ్ల పాటు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాజకీయ కార్యకలాపాలు కూడా అంత సాఫీగా జరగలేదు. ఇప్పుడు మూడో వేవ్ లో కరోనా విజృంభిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ మార్పు చేర్పుల గురించి సీఎం ఆలోచించకపోవచ్చు కూడా!
దీంతో కనీసం మరో రెండు మూడు నెలల పాటు ఈ అంశం వెనక్కు వెళ్లినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు మరో రెండేళ్లకు కాస్త ఎక్కువ సమయం ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ ఎప్పుడు మంత్రివర్గాన్ని మారుస్తారనే అంశం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. మంత్రి పదవుల గురించి ఆశలో రాయలసీమ నేతలే ముందు వరసలో ఉన్నారు. ఆశావహుల జాబితా రాయలసీమ నుంచినే ఎక్కువగా ఉంది.
ఇలాంటి నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఈ నేతలు ఎదురుచూస్తున్నా.. ఈ అంశం కార్యరూపం దాల్చడం లేదు. మరి ఎప్పుడో ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ!