ఒకవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒమిక్రాన్, డెల్టానో, డెల్టా ప్లస్.. ఇలా వేరియెంట్ లు ఏవో కానీ… కేసుల సంఖ్య అయితే విపరీత స్థాయికి చేరుతోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయంపు కాదు. ఏపీలో కూడా రోజు రోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది.
మరి కరోనా కేసుల సంఖ్య ఇలా పెరుగుతుంటే.. ప్రజలు ఎలా వ్యవహరిస్తున్నారనే తీరును గమనిస్తే.. భిన్నమైన స్పందన కనిపిస్తుండటం విశేషం. కరోనాను ఖాతరు చేయని రీతిలో.. భక్తి, సంబరాలు సాగుతున్నాయిప్పుడు. కరోనా తీవ్రత దృష్ట్యా కూడా ప్రజలు వెనక్కు తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
వైకుంఠ ఏకాదశి, సంక్రాంతిల సందర్భంగా భక్తి, సంబరాలు వెళ్లువెత్తాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. తిరుమల ఆలయంతో మొదలుకుని, పట్టణాల్లోని ఆలయాల వరకూ అన్నీ భక్తులతో పోటెత్తాయి. కొన్ని చోట్ల రద్దీలు, భక్తులు క్యూల్లో గంటల తరబడి వేచి ఉండటం కూడా తప్పలేదు. స్థూలంగా కరోనా పూర్వపు రోజుల్లో ఆలయాలు వైకుంఠ ఏకాదశి సందర్భంలా ఎలా ఉండేవో.. ఈ సారి కూడా అదే స్థాయి పరిస్థితి తలెత్తింది.
అయితే.. ఆందోళనల్లా.. భారీ ఎత్తున కేసులు వస్తున్న తరుణం కావడం. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఇళ్లలోనే పండగలు జరుపుకున్న వారి సంఖ్య చాలా పరిమితం. ప్రభుత్వాలు కూడా ఈ సారి ఆంక్షలు చెప్పలేదు. ఆంక్షలు పెడితే.. దానిపై పెద్ద రాజకీయానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఆంక్షలు పెట్టే సాహసం చేయడం లేదు.
ఇక సంక్రాంతి సంబరాలు కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రయాణాలు, సమూహాలుగా ఏర్పడి జరుపుకునే సంబరాలు… వేటి విషయంలోనూ రాజీ లేదు. ఇలా భారీ స్థాయిలో కరోనా కేసుల మధ్యన భారీ స్థాయిలో సంబరాలు చోటు చేసుకున్నాయి.
మరి ఈ ప్రభావం రాబోయే రోజుల్లో కేసులపై పడుతుందా? అనేదే పెద్ద ప్రశ్న. కేరళలో ఇలాగే బక్రీద్, ఓనమ్ సందర్భంగా ఆంక్షలు పెట్టకపోవడంతో ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కేసుల సంఖ్యతో ఆ రాష్ట్రం అట్టుడికింది. ఇప్పుడు దేశంలో ఎక్కడా ఎలాంటి ఆంక్షలు పెద్దగా లేవు. మరి రాబోయే పక్షం రోజుల్లో ఈ ప్రభావం ఏమిటో అర్థం కావొచ్చు! ఊరట ఏమిటంటే.. భారీ సినిమాల విడుదలలు లేకపోవడం. అవి కూడా ఉంటే.. కరోనాకు ఛాలెంజ్ విసురుతూ ఏపీలో సినీ వీరాభిమానులు థియేటర్ల వద్ద నే రెండు మూడు రోజుల పాటు పండగ చేసుకునే వారు!