ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విషెస్ చెబుతూ చేసిన తాజా ట్వీట్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బైడెన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అలాంటిది బైడెన్‌కు బదులు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహ్యారీస్‌కు జగన్ శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. కమలాహ్యారీస్ భారత్ మూలాలున్న మహిళా నేత. ఆమె తల్లి తమిళనాడు నివాసి.
ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంతో పాటు మన దేశానికి చెందిన కమలాహ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్ట మొదటి మహిళ కావడం విశేషం. కమలాహ్యారీస్ అమెరికా అత్యున్నత పదవికి ఎన్నిక కావడం గర్వంగా ఉందని జగన్ పేర్కొన్నారు.
ట్విటర్ వేదికగా జగన్ ఏమన్నారంటే… ‘ డెమోక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
కమలా హ్యారీస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా, అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ ఆమె రికార్డుకెక్కారు.
ఏది ఏమైనా భారత మూలాలున్న మహిళ అగ్రరాజ్యం పాలనలో భాగస్వామి కావడం మనందరం గర్వించదగ్గ సందర్భం ఇది అని చెప్పాలి.