హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతాయి. ఇప్పటికే షురూ కావాల్సి వుంది. వరదలు వచ్చి వెనక్కు నెట్టాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే దుబ్బాక ఎన్నిక వచ్చి తెలంగాణలో రాజకీయ కాక పెంచింది.
ఆ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు జరగడంతో, ఈసారి తెరాస ముందుగానే మేల్కొంది. ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీని ఆత్మరక్షణలోకి నెట్టి, ముందుగా తానే అడుగు ముందుకు వేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
వరదల వంటి విపత్కర పరిస్థితులు వస్తే గుజరాత్, కర్ణాటక లాంటి భాజపా పాలిత ప్రాంతాలకు వందల కోట్లు నిధులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ కు మొండి చేయి చూపిందంటూ మంత్రి కేటిఆర్ నేరుగా విమర్శలు కురిపించారు. ఆ విధంగా నగర ఎన్నికల హడావుడిని ఆయన సీటీ ఊది ప్రారంభించినట్లు అయింది.
ట్విట్టర్ లో కేటిఆర్ వేసిన ట్వీట్ హల్ చల్ చేస్తోంది. ప్రో తెరాస, ప్రో భాజపా జనాల కామెంట్లు వర్షంలా కురుస్తున్నాయి. హైదరాబాద్ కు కేంద్రం ఎటువంటి వరదసాయం అందించలేదన్నది బహిరంగ రహస్యం.
భాజపా నాయకులు కూడా మాట్లాడలేని బలహీనత అదే. కేటిఆర్ అక్కడే దెబ్బ కొట్టి, ఆ పార్టీ నేతలను ఆత్మ రక్షణలో పడేసారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ కు కేంద్రం రెండు వందల కోట్లకు పైగా సాయం ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
కానీ అలాంటిది ఏదీ లేదని, కిషన్ రెడ్డి సహాయ మంత్రి కాదు, నిస్సహాయ మంత్రి అని కేటిఆర్ ఎద్దేవా చేసారు. ఇక ఇఫ్పుడు విమర్శల బంతి వెళ్లి భాజపా కోర్టులో పడింది. ఆ బంతిని ఏ విధంగా రివర్స్ సెర్వ్ చేస్తారో చూడాలి మరి.