తప్పు చేశాడట…కుమిలిపోతున్నాడు…!

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌  కుమిలిపోతున్నాడు. అయ్యో…ఎంత పని చేశానంటూ ఆవేదన చెందుతున్నాడు.  తాను కాంగ్రెసును అనవసరంగా విడిచిపెట్టానని, తొందరపడ్డానని ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడు. కాంగ్రెసులో బలమైన నాయకుడిగా ఉన్న,…

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌  కుమిలిపోతున్నాడు. అయ్యో…ఎంత పని చేశానంటూ ఆవేదన చెందుతున్నాడు.  తాను కాంగ్రెసును అనవసరంగా విడిచిపెట్టానని, తొందరపడ్డానని ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడు. కాంగ్రెసులో బలమైన నాయకుడిగా ఉన్న, హైకమాండ్‌ వద్ద మంచి పేరున్న  డీఎస్‌ 2015లో టీఆర్‌ఎస్‌లో చేరాడు. డీఎస్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాగానే అక్కున చేర్చుకున్నాడు. ముందుగా ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. 2016 జూన్‌లో రాజ్యసభకు ఎన్నిక చేయించారు. పార్టీ ఫిరాయించినా తగిన ప్రతిఫలం దక్కిందనుకొని ఎంతో సంతోషించాడు. కాని టీఆర్‌ఎస్‌లో క్రమంగా డీఎస్‌ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. 

ఇందుకు కారణం అప్పటి నిజామాబాద్‌ ఎంపీ కమ్‌ కేసీఆర్‌ కూతురు కవితతో వచ్చిన తగాదా. డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, ఆయన్ని పార్టీ నుంచి సాగనంపాలని కవితకు తండ్రికి ఫిర్యాదు చేసింది. మరి కూతురు ఫిర్యాదు చేసినప్పుడు తండ్రి ఊరుకోడు కదా. అప్పటినుంచి డీఎస్‌ను లూప్‌లైన్‌లో పెట్టారు. అలా…అలా మొదలైన అభిప్రాయభేదాలు, పొరపచ్చాలు క్రమంగా పెద్దగైపోయాయి. కవిత చెప్పిన ప్రకారం డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించకుండా ఇతరత్రా అవమానాలపాలు చేశారు కేసీఆర్‌. డీఎస్‌ సామాజికవర్గం, ఇతర రాజకీయ సమీకరణాల కారణంగా ఆయన్ను బయటకు పంపలేదు కేసీఆర్‌. 

ఒకసారి మీడియా సమావేశంలో డీఎస్‌ గురించి ఓ విలేకరి ప్రస్తావించినప్పుడు 'ఉంటే ఉంటడు..పోతే పోతడు' అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత మీద డీఎస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్‌ బీజేపీ అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడంతో టీఆర్‌ఎస్‌లో డీఎస్‌ పెద్ద విలనైపోయాడు. పేరుకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ అది నామమాత్రమేనని చెప్పొచ్చు. పార్టీ సమావేశాల్లో, కార్యక్రమాల్లో డీఎస్‌ పాత్ర శూన్యం. ఈ నేపథ్యంలో ఈయన తిరిగి కాంగ్రెసులో చేరతాడని చాలాకాలం క్రితమే మీడియాలో వార్తలొచ్చాయి. 

కాని తానై తాను టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు రాదల్చుకోలేదు. కేసీఆర్‌ సస్పెండ్‌ చేయాలని కోరుకున్నాడు. అలా చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయం చేసి, సామాజికవర్గాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ను బద్నాం చేయాలని అనుకున్నాడు. కాని కేసీఆర్‌ ఆ పని చేయడంలేదు. తాజాగా డీఎస్‌ 'దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి' అని కేసీఆర్‌ను సవాల్‌ చేశాడు. గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఆమె, జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిసి డీఎస్‌ను సస్పెండ్‌ చేయాలని అధినేతకు లేఖ రాశారు. ఇప్పుడు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి  ఆరోపణలు చేయడంతో డీఎస్‌ మండిపడుతున్నాడు. 

అందుకే దమ్ముంటే సస్పెండ్‌ చేయాలని సవాల్‌ చేశాడు. ఈ గొడవల కారణంగానే మళ్లీ కాంగ్రెసులోకి వెళితే బాగుంటుందని అనుకుంటున్నాడట. వచ్చే ఏడాదితో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. అదయ్యాక కాంగ్రుసులో చేరతాడేమో…! ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్‌ 2004, 2009లో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మంత్రిగా పనిచేశాడు. ఇలాంటి నాయకుడు అప్పటి రాష్ట్ర కాంగ్రెసు దిగ్విజయ్‌ సింగ్‌తో గొడవలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి గులాబీ కండువా కప్పుకున్నాడు.

శాసన మండలిని రద్దు చేస్తున్నారా ?