ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లు పాసైపోయింది. అంటే సగం పనైపోయింది. ఈ బిల్లు శాసనమండలిలో పాసవుతుందో, ఆర్డినెన్స్ జారీ చేస్తారో, మండలినే రద్దు చేస్తారో అది తరువాత సంగతి. ప్రధానంగా అసెంబ్లీలో పనైపోయింది కాబట్టి జగన్ ప్రభుత్వానికి అది చాలు. పార్టీకి విపరీతమైన మెజారిటీ ఉంది కాబట్టి చాలా సులభంగా పనైపోయింది. ఇదిలా ఉండగా మూడు రాజధానులు ఎపిసోడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ఓ ముఖ్యమైన ఘట్టం. రాజధాని అమరావతిలోనే ఉంచాలని ప్రజలు తీవ్రంగా ఆందోళన చేస్తుండటంతో అక్కడి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్న తరువాత, ప్రభుత్వం సమస్త నిర్ణయాలు తీసుకున్న తరువాత నెల రోజులకు పైగా ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించి నాలుగు రోజుల సమయం ఇచ్చింది. సరిగ్గా సంక్రాంతి సెలవుల సమయంలో ఈ పని చేసింది. ఇది కూడా నేరుగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కాదు. ఆన్‌లైన్ ద్వారా అభిప్రాయాలు పంపాలని, సీఆర్‌డీఏ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పింది. దీంతో రైతులు, ప్రజలు అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం చాలా తక్కువ సమయం ఇచ్చిందని, పైగా మధ్యలో సెలవులు వచ్చాయని, ఇది సరికాదని హైకోర్టుకు వెళ్లారు.
దీంతో హైకోర్టు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.30 వరకు అభిప్రాయ సేకరణకు సమయం ఇచ్చింది. ఇది కోర్టు ఆదేశం. కాని ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. 20వ తేదీనే కేబినెట్ జరిగింది. అసెంబ్లీ సమావేశాలూ ప్రారంభమయ్యాయి. అదే రోజున అసెంబ్లీ మూడు రాజధానులు బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే తాను అనుకున్న ప్రకారం పని కానిచ్చింది. అలాంటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అసలు ఎందుకు? దాన్ని పరిగణలోకి తీసుకోనప్పుడు దానికి విలువేముంది? రాజధాని అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయబోమని ప్రజలకు, కోర్టుకు చెప్పివుండాల్సింది.
రాజధాని వ్యవహారంతో ప్రజలకు సంబంధం లేదని ప్రభుత్వం భావించింది. ఇది పూర్తిగా తన సొంత వ్యవహారమని సీఎం జగన్ భావించారు. అందుకనే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని ఆయన అనుకోలేదు. ప్రజాభిప్రాయాన్ని హైపవర్ కమిటీ తన నివేదికలో చేర్చకుండానే ముఖ్యమంత్రికి సమర్పించింది. కేబినెట్లో దాన్ని ఆమోదించారు. ఇదిలా ఉండగా, నిన్న మూడు రాజధానులు బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో హైకోర్టు ప్రజాభిప్రాయ సేకరణ గడువును 22వ తేదీ (బుధవారం) వరకు పొడిగించింది. పొడిగించిన తేదీ వరకు రాజధాని విషయంలో ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేయవచ్చని హైకోర్టు చెప్పింది.
అసెంబ్లీలో బిల్లు ఆమోదించాక ప్రజల అభ్యంతరాలను, సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నామో సర్కారు అసెంబ్లీలో ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆ వివరాలు తెలియచేశారు. ఇంకా ఈ ప్రజాభిప్రాయం ఏం చేసుకుంటారని అమరావతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి మండలిలో సైతం వైకాపాకు బలం ఉన్నట్లయితే ఈ పాటికే బిల్లు అక్కడా ఆమోదం పొంది ఉండేది. సాధారణంగా ప్రభుత్వాలు ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తరువాత ప్రజల అభిప్రాయాలు పట్టించుకోవు. నిరంకుశంగానే వ్యవహరిస్తాయి.
నిజానికి అమరావతి వ్యవహారంలో జీఎన్‌రావు కమిటీ నివేదిక, బోస్టన్ గ్రూపు నివేదిక కంటితుడుపు చర్యలే. రాజధాని మార్పు విషయంలో ఏం చేయాలో సీఎం జగన్ ముందుగానే నిర్ణయించుకొని అందుకు తగిన స్కెచ్ వేసి రడీగా పెట్టుకున్నారు. దాని ప్రకారమే ఈ రెండు కమిటీల నివేదికలు అందాయి. ఈ కమిటీలు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండానే, జగన్ అభిప్రాయానికి అనుగుణంగా నివేదికలు తయారుచేశాయి. దీంతో సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
నిజానికి ఈ రెండు కమిటీల నివేదికలు అందేనాటికి కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే ఆలోచన సర్కారుకు లేదు. దీనిపై విమర్శలు రావడంతో మరింత ప్రజాస్వామికంగా వ్యవహరించామని చెప్పుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన చేసింది. కాని ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండానే కేబినెట్ భేటీ అయింది. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రభుత్వం తరపున అధికారులో, కమిటీయో వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి, నిర్దిష్ట అంశాలపై లేదా అజెండాపై అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఇలా అభిప్రాయ సేకరణ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాని జగన్ సర్కారు తూతూ మంత్రంగా అభిప్రాయ సేకరణ చేయాలని ముందుగానే నిర్ణయించుకుంది కాబట్టి ఎలాంటి అజెండాను, అంశాలను ప్రజలకు తెలియచేయలేదు. చివరకు హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోలేదు.