పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా జైలు నుండి విడుదల అవుతున్నారు. 34 ఏళ్ల క్రితం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోయిన కేసులో సిద్దూకు ఏడాది శిక్ష పడింది. మేలో విడుదల కావాల్సి ఉన్నా.. అతని “సత్ప్రవర్తన” కారణంగా ముందుగానే విడుదల చేస్తున్నారు.
1988లో నవజ్యోత్ సిద్ధూ మరియు అతని స్నేహితుడితో పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడితో సిద్దూకు పార్కింగ్ విషయమై వాగ్వాదం జరిగింది. దాడిలో గాయపడిన గుర్నామ్ సింగ్ చిక్సిత పొందుతూ చనిపోయారు. ఆ కేసులో సిద్దూకు ఏడాది శిక్ష పడింది. మే 2022 నుంచి ఆయన పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె స్టేజీ 2లో ఉన్నారు. దీంతో గత వారం జైలులో ఉన్న తన భర్తను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ” మీరు చేయని నేరానికి జైలులో ఉన్నారు. దీనికి కారణమైన వారందరినీ క్షమించండి. బయట ఉన్న నేను.. నీ కంటే ఎక్కువగా బాధపడుతూ..ప్రతి రోజు మీ కోసం ఎదురుచూస్తున్నాను. నాకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని తేలింది. మీ కోసం నేను ఇంకా ఎంతో కాలం వేచి ఉండలేను. సర్జరీకి వెళ్తున్నా. దీనికి ఎవ్వర్నీ నిందించలేము. ఎందుకంటే అది దేవుడు చేసిన నిర్ణయం” అంటూ ఎమోషనల్ అయింది.