వరుస ఘటనలు.. విమానంలో మరో పాడు పని

“విమానంలో పాడు పనులు” అనే సిరీస్ కొనసాగుతూనే ఉంది. తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహా…

“విమానంలో పాడు పనులు” అనే సిరీస్ కొనసాగుతూనే ఉంది. తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహా ఘటనలు మరిన్ని జరిగాయి. వాటిపై కూడా విచారణలు, సస్పెన్షన్లు సాగుతున్నాయి. ఇప్పుడు మరో ఘటన సంచలనంగా మారింది.

ప్రయాణికులకు సేవలు అందించే ఎయిర్ హోస్టెస్ పై, ఓ విదేశీ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. బ్యాంకాక్ నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని స్వీడన్ జాతీయుడిగా గుర్తించారు.

ఇంతకీ ఏం జరిగింది..

ఇండిగోకు చెందిన 6E-1052 విమానం బ్యాంకాక్ నుంచి ముంబయికి టేకాఫ్ అయింది. విమానం గాల్లో ఉంది. అంతలోనే క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌ అనే 62 ఏళ్ల స్వీడన్ జాతీయుడు, తన సహ-ప్రయాణికుడిపై దాడి చేశాడు. అల్లకల్లోలం సృష్టించాడు.

ఆ గొడవను విమాన సిబ్బంది సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత భోజన సమయంలో తనకు చికెన్ కావాలని కోరాడు సదరు ప్రయాణికుడు. ఎయిర్ హోస్టెస్ అతడికి చికెన్ అందించింది. ఆ తర్వాత డబ్బుల కోసం స్వైపింగ్ మెషీన్ తో అతడ్ని సంప్రదించింది.

కార్డ్ స్వైప్ చేయాలనే సాకుతో, అతను అనుచితంగా ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకున్నాడు. వికృతంగా ప్రవర్తించాడు. ఎయిర్ హోస్టెస్ నిరసన తెరపడంతో, మరోసారి సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులపై విరుచుకుపడ్డాడు వెస్ట్ బర్గ్.

తోటి ప్రయాణికులు, సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడ్ని ముంబయి విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా బెయిల్ పై అతడు విడుదలయ్యాడు. భారతదేశంలో గడిచిన 3 నెలల్లో, విమానంలో జరిగిన వికృత ఘటనల్లో ఇది వరుసగా 8వది.