సీఎం చెంత‌కు తిరుమ‌ల పంచాయితీ

తిరుమ‌ల‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అవ‌మానించేలా ఈవో ధ‌ర్మారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ….ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద పంచాయితీ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. సీఎం జ‌గ‌న్‌ను ఈవో ధ‌ర్మారెడ్డి, గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా…

తిరుమ‌ల‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అవ‌మానించేలా ఈవో ధ‌ర్మారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ….ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద పంచాయితీ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. సీఎం జ‌గ‌న్‌ను ఈవో ధ‌ర్మారెడ్డి, గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు క‌లిసిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల ఈవో ధ‌ర్మారెడ్డి తీరు విమ‌ర్శ‌ల‌పాల‌వ‌డంపై “గ్రేట్ ఆంధ్ర” వ‌రుస క‌థ‌నాలు రాసిన సంగ‌తి తెలిసిందే.

ఈవో తీరుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఏ కొద్ది మంది త‌ప్ప‌, మిగిలిన వాళ్లంతా త‌మ‌ను చిన్న చూపు చూస్తున్నార‌నే ఆవేద‌న‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఇది న‌ష్టం తెస్తుంద‌ని అధికార పార్టీ గ్ర‌హించింది. వెంట‌నే ఈవోను సీఎం కార్యాల‌యానికి పిలిపించుకున్నారు.

ఇటీవ‌ల ఈవోపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన గిద్ద‌లూరు ఎమ్మెల్యేను కూడా పిలిపించిన‌ట్టు స‌మాచారం. ఇద్ద‌రినీ కూచోపెట్టుకుని అస‌లు వివాదానికి దారి తీసిన ప‌రిస్థితుల గురించి సీఎం ఆరా తీసిన‌ట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు త‌గిన గౌర‌వం ఇవ్వాల‌ని ఈవోకు సీఎం జ‌గ‌న్ సూచించిన‌ట్టు స‌మాచారం. 

తిరుమ‌ల అనేది హిందువుల‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన పుణ్య‌క్షేత్రం అని, వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తిన‌కుండా చూడాల్సిన గురుత‌ర బాధ్య‌త ఉంద‌నే సంగ‌తి మ‌రిచిపోకూడ‌ద‌ని ఈవోకు సీఎం చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు మీడియాకెక్కి విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల అధికారంలో ఉన్న మ‌న‌కే ఇబ్బంద‌ని గ్ర‌హించాల‌ని అన్నా రాంబాబుకు సీఎం చెప్పిన‌ట్టు స‌మాచారం. అలాగే తిరుప‌తి, తిరుమ‌ల‌లో ప‌రిస్థితుల‌పై ధ‌ర్మారెడ్డిని అడిగి సీఎం తెలుసుకున్నార‌ని స‌మాచారం.