భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. అమరావతి రాజధాని రైతుల పోరాటానికి 1200 రోజులు పూర్తయిన సందర్భంగా వారి శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలియజేసిన తర్వాత అక్కడినుంచి తిరిగి వెళుతున్న సందర్భంగా.. మూడు రాజధానుల అనుకూల పోరాట శిబిరం సమీపంలో ఈ దాడి జరిగింది. కాబట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడిచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ తర్వాత అక్కడి పరిస్థితుల్ని పరిశీలించడానికి ఎంపీ నందిగం సురేష్ వెళ్లారు గనుక.. దాడి చేసింది కూడా ఆయన అనుచరులే అని ముడిపెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ దాడి, దానికి ముందు వెనుక జరిగిన సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు పుడుతున్నాయి. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందా అని కూడా అనిపిస్తుంది.
=) అమరావతి రైతుల శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేయడం అనేది భాజపా అధికారిక కార్యక్రమమేనా? అయితే పార్టీ ఇతర పెద్దలు ఎందుకు వెళ్లలేదు. బిజెపిలో చంద్రబాబు కోవర్టుగా ముద్ర ఉన్న ఆదినారాయణరెడ్డి, చంద్రబాబు అనుకూల నాయకుడిగా గుర్తింపు ఉన్న సత్యకుమార్ మాత్రమే ఎందుకు వెళ్లారు.
=) ఆదినారాయణ రెడ్డి శిబిరం వద్ద చాలా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. దాడిచేసిన వారిలో ఒకవేళ నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండేట్లయితే వారికి దాడిచేయాలని కోరిక పుట్టే విధంగా, వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఆదినారాయణ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగం చేశారు.
=) అయితే తన ప్రసంగం పూర్తయిన తర్వాత.. పార్టీ జాతీయ కార్యదర్శి, పార్టీలో తనకంటె ముఖ్యుడు, సీనియర్ అయిన సత్యకుమార్ కోసం వేచి ఉండకుండా ఆదినారాయణ రెడ్డి ఎందుకు వెళ్లిపోయారు? ఆదినారాయణ రెడ్డి ప్రసంగం అయ్యాక చేయి నొప్పిగా ఉందని వెళ్లిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.
=) రెచ్చగొట్టడానికి మాత్రమే తీవ్రపదజాలంతో ప్రసంగించి, దానికి ప్రతిస్పందన తీవ్రంగా ఉండేట్లయితే దాని బారిన తాను పడకుండా సత్యకుమార్ ను ఇరికించడానికి మాత్రమే వ్యూహాత్మకంగా కుంటిసాకులు చెప్పి ఆదినారాయణ రెడ్డి వెళ్లిపోయారా? ఈ ‘చేయి నొప్పి’ అనేది డ్రామాలాగా అనిపించడం లేదా?
=) ఏపీలో ఎటూ గెలిచే అవకాశం లేని బిజెపిని వీడి, తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్న ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబునాయుడు స్కెచ్ ప్రకారం మూడు రాజధానుల అనుకూల శిబిరాన్ని రెచ్చగొట్టేసి, తానుచల్లగా ముందే జారుకుని, వారి ఆగ్రహానికి సత్యకుమార్ ను బలిపెట్టారా?
=) మోడీ అండ్ కో తో జగన్ కు ఉన్న సన్నిహిత సంబంధాల్ని చెడగొట్టడానికి ఇలాంటి వ్యూహాత్మక దుర్మార్గాన్ని ప్లాన్ చేసింది చంద్రబాబునాయుడేనా?
=) ఇంతకూ అసలు దాడిచేసినది మూడు రాజధానుల అనుకూల వ్యక్తులేనా? వారి ముసుగులో తెలుగుదేశం పెయిడ్ కూలీలా?
=) ఈ దాడిని ఖండించడం ద్వారా.. చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కలిసి బిజెపిని ప్రసన్నం చేసుకోవచ్చునని గానీ, తమ పొత్తుల్లోకి బిజెపిని ఆకర్షించవచ్చునని గానీ తలపోస్తున్నారా?
సత్యకుమార్ కారు మీద జరిగిన ఈ ఒక్క దాడి గురించి లోతుగా ఆలోచిస్తే ఇన్ని అనుమానాలు పుడుతున్నాయి. మరి ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశాం అని చెబుతున్న పోలీసులు బాధ్యులుగా ఎవరిని తేలుస్తారో చూడాలి.