టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరక్టర్ ఎవరు అంటే ఎటువంటి వివాదానికి తావు లేకుండా వినిపించే పేరు థమన్. కొన్నాళ్ల క్రితం వరకు దేవీ ఈ ప్లేస్ లో వుంటే ఇప్పుడు థమన్ ఆ ప్లేస్ లోకి వచ్చాడు.
దేవీ, థమన్ కు ఇద్దరికీ వున్న కామన్ లక్షణం ఏమిటంటే, ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా వుండడం, హీరోలు, డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇలా ఇండస్ట్రీలో అందరితో వాళ్ల మనుషుల్లా వుండడం.
దీనికి తోడు ఇప్పుడు థమన్ వరుసగా హిట్ ల మీద హిట్ లు కొడుతుంటే మరీ దూసుకుపోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో విశాఖలో జరిగిని అల వైకుంఠపురములో సినిమా సభలో థమన్ మాటలు వివాదానికి దారితీసాయి.
నిజాలే మాట్లాడుకుందాం..నిజమైన కలెక్షన్లే చెప్పుకుందాం అన్నమాటలు థమన్ నోటి వెంట వచ్చాయి. దాంతో ట్విట్టర్ లో హడావుడి మొదలయింది.
ఈ విషయంలో థమన్ ను నేరుగా 'గ్రేట్ ఆంధ్ర' కాంట్రాక్టు చేసింది. దానికి ఆయన సవివరమైన సమాధానం ఇచ్చారు.
''..నేను ఏమీ కావాలని అన్న మాటలు కాదు. అలాగే ఎవరినో టార్గెట్ చేస్తూ అన్న మాటలు కాదు. జస్ట్ క్యాజువల్ గా అన్నీ నిజాలే మాట్లాడుకుందాం..అంటూ ఆ ఫ్లోలో అలా అనేసాను. నాకు అప్పటికి ఈ సినిమాలు, వీటి కలెక్షన్ వివాదాలు ఏవీ తెలియవు. తరువాత ఎవరో ట్విట్టర్ లో నా స్పీచ్ క్లిప్ పెట్టి, అనిల్ సుంకరకు సమాధానం అన్నట్లు పెట్టారు. అప్పుడు తెలిసింది ఇదంతా చాలా వ్యవహారం వుందని.
నాకు అందరూ స్నేహితులే. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు పనిచేసాను. మంచి హిట్ సాంగ్ లు ఇచ్చాను. త్వరలో మళ్లీ మహేష్ సినిమాకు పనిచేయబోతున్నాను. దిల్ రాజు నిర్మించే మహేష్ బాబు సినిమాకు మంచి పాటలు సంగీతం అందించబోతున్నాను.
అందువల్ల నేను ఎవరినో ఉద్దేశించి అన్నాననో, ఎవరి కోసమో అన్నాననో అనుకోవద్దు. అలా అనిపించి వుంటే అది నేను కావాలని చేసింది కాదు అని గ్రహించండి..'' అంటూ సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు థమన్.
థమన్ సమాధానం ఎలా వున్నా, మహేష్ సినిమాకు థమన్ పని చేయబోతున్నారు అన్న విషయం మాత్రం ఆ ఇద్దరి ఫ్యాన్స్ కు సూపర్ శుభవార్తే.