వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు వర్తమాన రాజకీయాలపై ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు. విజయసాయి ట్వీట్లు ఘాటుగా, సూటిగా ఉంటాయి. రెండుమూడు రోజుల క్రితం పవన్ బీజేపీలో చేరికపై తనదైన శైలిలో ఆయన్ను జీరోతో పోల్చాడు. విజయసాయి ట్వీట్‌కు నాగబాబు రియాక్ట్ కావడం, దానిపై తిరిగి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రీట్వీట్ చేయడం…ఇలా విజయసాయి ఒక్క ట్వీట్ రాజకీయ అగ్గి రాజేసింది.
తాజాగా ఆయన మరో ట్వీట్ చేశాడు. ఈ సారి ఆయన ఓ మీడియా సంస్థ అధినేతను టార్గెట్ చేశాడు.
'బాస్' పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదు. వందల కోట్ల రూపాయలను దోచుకునే అవకాశం కోల్పోవడంతో 5 కోట్ల మంది ప్రజలపై ద్వేషాన్ని పెంచుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నారు’ అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తాడు.
కిరసనాయిలు, చెత్తపలుకులు, వందల కోట్లు దోచుకునే….తదితర పదాలు విన్న వెంటనే ఓ పత్రిక, దాని అనుబంధ చానల్‌కు సంబంధించిన మీడియా అధిపతి గుర్తుకొస్తాడు. గతంలో తాను కిరసనాయిలు వ్యాపారం చేసుకునేవాడినని స్వయంగా ఆయనే ఓ సందర్భంలో వ్యాసం రాశాడు.
అలాగే ‘కొత్త’గా ‘పలుకు’ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆదివారం వచ్చిందంటే చాలు ‘నేనున్నా’నంటూ జగన్‌పై విషం కక్కేందుకు వస్తుంటాడు. దోచుకోవడం అంటే….అదేనండీ చంద్రబాబు హయాంలో వందల కోట్ల రూపాయలను యాడ్స్ రూపంలో వెనకేసుకున్నాడనే ప్రచారం ఉంది కదా! ఇక విజయసాయిరెడ్డి సదరు వ్యక్తి పేరు ప్రస్తావిండచం అనవసరం అనుకున్నట్టుంది.