జనసేన పార్టీ తరపున ఏ మీటింగ్ జరిగినా.. పవన్ కల్యాణ్ ఓ పుస్తకం, పెన్ను పట్టుకుని కనిపిస్తారు. అధినేతను అనుకరించాలనుకుంటారో లేక, తాము స్వయం ప్రకటిత మేథావులుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారో తెలియదు కానీ.. మిగతా బ్యాచ్ కూడా పుస్తకం, పెన్ను పట్టుకుని హాజరవుతుంది. అంతే కాదు, అధినేత చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా నోట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తారు జనసేన వ్యూహకర్తలు.
మిగతా ఏ పార్టీల మీటింగుల్లో కూడా మనకి ఇలాంటి నాటకీయ పరిణామాలు కనిపించవు. జనసేన మీటింగ్ అంటే చాలు, అంతా సినిమా షూటింగ్ లా ఉంటుంది. అందరూ పద్ధతిగా వచ్చి కుర్చీల్లో కూర్చుంటారు, పవన్ నోరు తెరవడం, వీళ్లందరూ పెన్ను క్యాప్ తీయడం ఒకేసారి జరుగుతాయి. ఆఖరికి నాగబాబు కూడా మేథావిలా పెన్నూ పేపర్ తీసుకుని సిద్ధమైపోవడం ఇక్కడ కొసమెరుపు.
గతంలో ఇలాంటి మేథావి బ్యాచ్ వల్లే ప్రజారాజ్యం పుట్టి మునిగింది. సరైన రాజకీయ నాయకులు లేకపోవడం, భజన బ్యాచ్ ఎక్కువ కావడం, రాజకీయ పరిజ్ఞానం కంటే పుస్తక విజ్ఞానం ఉన్నవాళ్లు ఎక్కువ కావడంతో ప్రజారాజ్యం నడక సరిగా సాగలేదు. ఇప్పుడు పవన్ చుట్టూ ఇలాంటి వారే చేరుతున్నారు. నాదెండ్ల మనోహర్ మినహా.. మిగతా ఎవరికీ ప్రత్యక్ష రాజకీయ కుస్తీలు తెలియవు. విచిత్రంగా మనోహర్ కూడా జనసేనలో చేరిన తర్వాత కార్పొరేట్ పొలిటీషియన్ గా మారిపోయారు.
బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టు ఎవరూ పవన్ కి ఎదురు చెప్పరు. అసలా బాస్ కి కూడా ఏమీ తెలియదన్న విషయం వీరికి బాగా తెలుసు. కానీ కేవలం సీన్ రక్తికట్టించడం కోసం అందరూ కట్టప్పలుగా మారి “తమరి ఆజ్ఞ ప్రభూ” అన్నట్టు ఆలకిస్తారు. ఇలాంటి నాటకాల వళ్ల పవన్ సంతోషించవచ్చు, తన మాటే శాసనంగా అందరూ డిక్టేషన్ రాసుకుంటున్నారని పొంగిపోనూవచ్చు.
కానీ ఎప్పటికీ ఇలాంటి మేథావులు పార్టీని అధికారంలోకి తీసుకు రాలేరనే విషయాన్ని పవన్ గ్రహిస్తే మంచిది. అది గ్రహించనంతకాలం.. ఎన్నికల్లో గెలిచిన రాపాకను పవన్ శత్రువుగానే భావిస్తారు, ఓట్లు వేయించుకోలేని మేథావి వర్గాన్ని మాత్రమే దగ్గరకు తీస్తుంటారు.