కమ్మ వాళ్లు అంటే సరిపోకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిని అమరావతి నుంచి తీసుకెళ్లిపోతున్నారు.. ఇది స్వయంగా తెలుగుదేశం అనుకూల మీడియా చేసిన ప్రచారం. ఆ విషయంలో బైలైన్ ఆర్టికల్స్ రాసుకుని మరీ బాధపడ్డారు కొందరు కమ్మ మీడియాధిపతులు. ఇక జేసీ దివాకర్ రెడ్డి వంటి తెలుగుదేశం నేతలు కూడా ఇదే మాటే మాట్లాడారు. కమ్మ వాళ్ల మీద వ్యతిరేకతతోనే జగన్ అలా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
కమ్మవాళ్లు గట్టిగా ఉండే ప్రాంతంలో రాజధాని జగన్ కు ఇష్టం లేదనే విశ్లేషణ కూడా గట్టిగా సాగించారు. గత నెల రోజులుగా ఇదే పాయింట్ మీదే ఒక మీడియా నడమంత్రపు మోతుపరి ఎన్ని ఆర్టికల్స్ రాసుకని బాధపడ్డారో! కులం కులం అంటూ ఆయన కుళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారందరి బాధను తీర్చడానికి జగన్ కూడా పూనుకున్నారు.
కమ్మ వాళ్లకు తను వ్యతిరేకిని కాదని స్వయంగా జగన్ అసెంబ్లీలో చెప్పారు. తనకు కమ్మ వాళ్లలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆయన వివరించారు. తనకు మంచి సన్నిహితుల్లో ఒకరైన కొడాలి నాని అదే కులానికి చెందిన వారనే విషయాన్ని గుర్తు చేశారు. తన ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఫిక్స్ చేసే తలశిల రఘు అదే కులానికి చెందిన వ్యక్తే అని అన్నారు.
తాము ఒక కులం వారు ఓటేస్తే అధికారంలోకి రాలేదని.. బీసీలు, కమ్మ వాళ్లు, రెడ్లు.. అందరూ ఓటేస్తేనే తాము అన్ని సీట్లను సాధించుకున్నామని, అలాంటప్పుడు ఒక కులం మీద వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే దుర్భర పరిస్థితుల్లో తను లేనంటూ జగన్ స్పష్టం చేశారు.