16 02 1997 నాటి ‘‘ఎ.పి.టైమ్స్’’ దినపత్రిక వారాంతపు సాహిత్యానుబంధంలో ప్రచురించబడిన నా ‘‘సుధాస్ ఛాయిస్’’ అనే ఆంగ్లకథకు యిది తెలుగు అనువాదం.
‘‘ఏవంటున్నారండీ, పెళ్లివారు? పిల్ల నచ్చినట్టేనా?’’ అని దయానిధి అప్పుడే వస్తున్న శేషగిరి గార్ని అడిగేరు. ‘‘మన సుధ నచ్చకపోవడమేం… కానీ కట్నం దగ్గిరే కాస్త తికమకగా ఉంది.’’ అన్నారు శేషగిరిరావు సోఫాలో కూలబడుతూ. దయానిధి మరో సోఫాలో కూర్చొంటూ ‘‘ఏం ఆశ అంత ఎక్కువగా ఉందా?’’ అన్నారు.
‘‘అలాగే ఉంది, తల్లిదండ్రుల్ని అడిగితే కుర్రాణ్ణి అడగమన్నారు. అతన్తో ఓ పెద్ద చిక్కుగా ఉంది. తను ఎంత అనుకొంటున్నాడో చెప్పడు. నేనే ముందుగా లక్ష అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు. ఇక బేరాలెందుకని మనం అనుకున్నట్లుగా లక్షా ఏభైవేలు చెప్పాను. ఇంకో నవ్వు నవ్వి ఆలోచించి చెప్పండి’ అన్నాడు. మరి మీరేమంటారోనని…’’
‘‘ఇంకా ఆలోచించేది ఏమిటి? అక్కర్లేదని చెప్పండి’’ అంటూ విసురుగా అంది అప్పుడే పక్కగదిలోంచి వచ్చిన సుధ. అప్పటికే ఆ గదిలో దయానిధి భార్య హైమావతి, కొడుకు సుధీర్ కూడా చేరారు. దయానిధి సుధకేసి సానునయంగా చూసి, ‘‘కంగారుపడకమ్మా, ఆలోచిస్తున్నాంగా’’ అన్నారు.
‘‘ఇంకా ఏమిటి నాన్నా ఆలోచన? అసలు కట్నం తీసుకొనే వాణ్ని చేసుకోకూడదని ఎంతో అనుకున్నాను. మనవాళ్లల్లో కట్నాలు యివ్వకుండా పెళ్లికాదని మీరందరూ నచ్చచెబితే సరేనని పెళ్లిచూపులకు కూర్చున్నాను. పైగా బేరాలు కూడానా?’’ అంది సుధ ఆవేశపడుతూ.
కానీ ఎవరూ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. దయానిధి ఆలోచనలో పడ్డారు. సుధీర్ మాత్రం మండిపడుతూ ‘‘బాంక్ ఆఫీసర్‌కి లక్షన్నరకన్న ఎక్కువ కట్నం కావాల్సి వచ్చిందా?’’ అన్నాడు.
శేషగిరిగారు శాంతంగానే ‘‘బాబు మీ నాన్నగారి స్టేటస్ తెల్సుకదా, ఇవ్వలేకపోతారాని అడిగి ఉంటారు. లోకరీతే అంత, ఏం చేస్తాం?’’ అన్నాడు.
దయానిధి ఆలోచన ముగించి ‘‘పోనీ రెండు అనండి. ఏమంటారో చూద్దాం’’ అన్నాడు.
‘‘నేనొప్పుకోను’’ అంటూ సుధ అరుస్తుంటే ‘‘నువ్వు నోరు మూసుకో, పెద్దవాళ్ల మాటల్లో నువ్వెందుకు తలదూర్చడం?’’ అంటూ తల్లి గదమాయించింది.
మధ్యాహ్నం అంతా సుధ పక్కమీద దొర్లుతూనే ఉంది. పుస్తకం మీదకు మనసు పోవడం లేదు. మనస్సులో ఏదో వెలితిగా ఉంది. తనమీద తనకున్న విశ్వాసం సడలిపోతున్నట్టూ, ఏదో అగాధంలో పడిపోతున్నట్టూ ఉంది. తన గురించి ఎన్నడూ ఇప్పటిదాకా తక్కువగా అనుకోలేదు. తండ్రి లక్షాధికారి. తను రూపసి. పోస్టు గ్రాజువేట్. ఉన్న ఒక్క అన్నగారు ఎమ్బీయే చేసి తండ్రికి ఫ్యాక్టరీలో సాయపడుతున్నాడు. కుటుంబానికి ఏ వంకా లేదు. ఇవన్నీ చూసి మొన్న వచ్చిన పెళ్లికొడుకు ఇస్తానన్న దానికి మారు మాట్లాడకుండా ఒప్పుకొంటాడనుకుంది. కానీ, ఇలా బేరాలాడతా డనుకోలేదు. తలచుకొన్న కొద్దీ మనస్సు కుతకుతలాడిపోసాగింది.
దీర్ఘాలోచన తర్వాత అతని దగ్గరికి వెళ్లి స్వయంగా మాట్లాడితే మంచిదనిపించింది. ఇప్పుడే ఇలా బేరాలాడేవాడు తర్వాత ఎన్ని హింసలు పెడతాడో; వెళ్తే ఎబ్బెట్టుగా ఉంటుందాని ఆలోచించింది. అంతగా అయితే ఏమవుతుంది? ఇలాటి సిగ్గులేని అమ్మాయి మాకొద్దు అంటారు. మరీమంచిది.
డ్రెస్ మార్చుకొని సినిమాకని చెప్పి బయటకు బయల్దేరింది. ‘‘కారు తీసుకెళతావా?’’ అంది హైమావతి. వద్దని చెప్పి బస్సులో అతను పనిచేసే బాంక్కు వెళ్లింది.
బాంక్ చాలా రద్దీగా ఉంది. తలవంచుకొని పనిచేసుకొంటున్నాడతను. టేబుల్నిండా పుస్తకాలు, చుట్టూ కస్టమర్స్. వాళ్లు వెళ్లిపోతారేమోనని కొంచెంసేపు చూసింది. వెళ్లేవాళ్లు వెడుతుంటే వచ్చేవాళ్లు వస్తున్నారు. ఇక లాభం లేదని అతని బల్ల దగ్గరకు వెళ్లి, ‘‘నమస్కారం మధుగారు’’ అంది నెమ్మదిగా.
అతను తలెత్తి చూసాడు. కళ్లు ఒక్కసారి మెరిసాయి. ‘‘మీరా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.
కాస్త ఎపాలజటిక్గానే ‘‘మీతో కొంచెం మాట్లాడాలి… ఏవనుకోకపోతే’’ అంది సుధ.
‘‘నోనో దాన్దేముఁది. వస్తా కొంచెం కూర్చోండి’’ అని ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు.
కొన్ని సంతకాలు పెట్టి, డ్రాయరు తాళం వేసి పక్క వాళ్లకి పని చూడమని చెప్పి మధు సుధతో బయటికి వచ్చి హోటల్లో కూర్చునేసరికి పావుగంట అయింది. సర్వర్కి ఆర్డరిచ్చి అతను వెళ్లాక మధు అడిగాడు. ‘‘చెప్పండి. ఏమిటి విశేషం?’’
‘‘మరేంలేదు. ఇలా ఒక అమ్మాయి వచ్చి మాట్లాడడం మీకు…’’ సుధ నాన్చింది.
‘‘చూడండి సుధగారు, అక్కడ పని వదిలిపెట్టి వచ్చాను. ఫార్మాలిటీస్ లేకుండా ఉన్న విషయం చెప్పండి’’ అన్నాడు. ‘‘ఆహా ఏం మనిషిరా బాబూ, తన జీవిత భాగస్వామి కాబోయే వ్యక్తితో ఇలాగేనా మాట్లాడడం’’ అనుకొంది సుధ. తనూ అతనికంటే సూటిగా ముక్కు గుద్ది మాట్లాడడమే మంచిదనిపించింది. ‘‘కట్నం గురించి బేరాలాడడం మీకు సిగ్గుగా అనిపించడం లేదూ?’’ అంది.
మధు కళ్లు నవ్వాయి. ‘‘శేషగిరిగారు మీకు ఏం చెప్పారో ముందు తెలుసుకోనివ్వండి’’ అన్నాడు. సుధ చెప్పింది. అంతావిని ‘‘రెండు లక్షలదాకా వచ్చేరన్నమాట’’ అన్నాడు.
సుధకు ఒళ్లు మండిపోయింది. కాలేజీలో తను ఇచ్చిన ఉపన్యాసాలు తన్నుకొచ్చాయి. ‘‘స్త్రీ పురుషులు సమానమంటూనే ఈ బేరాలు ఏమిటండీ? నేనూ మీలాటి పోస్టు గ్రాజువేట్నే, నేనెందుకు డబ్బు యివ్వాలి?’’ అంటూ ఆవేశంగా ఊగిపోయింది.
మధు చెక్కు చెదరలేదు. తాపీగా ‘‘స్త్రీ, పురుషులు సమానమయితే కొడుకు నొకలాగ, కూతురు నొకలాగ చూడడం ఎందుకు?’’ అన్నాడు.సుధకు అర్థం కాలేదు. ‘‘అంటే?’’
మధు వివరించాడు. ‘‘మీ నాన్నగారికి పది లక్షలదాకా ఆస్తి ఉంది. మీ ఇద్దరూ ఆయనకి సమానమే అయినప్పుడు మీకు అయిదు లక్షలివ్వకుండా రెండు లక్షలే ఇస్తాననడం ఎందుకు?’’
సుధ తెల్లబోయింది. సమాధానంగా ఏం చెప్పాలో తెలియలేదు. అదృష్టవశాత్తూ సర్వర్ కాఫీ తెచ్చి యిచ్చేడు. కాఫీ రెండు గుక్కలు తాగాక సుధ మెల్లిగా అంది. ‘‘అంటే మీకు అయిదు లక్షలు కావాలంటారా?’’
‘‘నాకు కావాలనటం లేదు. మీకు రావాలంటున్నాను. అది మీ పేరనే ఉంటుంది’’
‘‘మా నాన్నగారికి వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తి తరిగిపోతే?’’
‘‘నేనన్నది ఇప్పుడే ఇమ్మనమని కాదు. ఆయన తదనంతరం మీ ఇద్దరికీ సమానంగా రావాలంటాను.’’
సుధకు ఇది సమంజసంగానే తోచింది. అయినా అయిదు లక్షలు కట్నమే అయ్యబాబోయ్ అనిపించింది. అఫెన్సివ్‌గా మాట్లాడితే ఏమంటాడో చూద్దామనిపించింది. ‘‘ఈ డబ్బు లేకపోతే మీరు పెళ్లాన్ని పోషించలేరా?’’
‘‘ఎందుకు పోషించలేను? కానీ రావాల్సిన డబ్బును ఎందుకు వదులుకోవడం? నా జీతంతో నేను హాయిగా బ్రతకగలను. కానీ మా నాన్న ద్వారా వచ్చే ఆస్తిని వద్దంటున్నానా?’’
సుధకు ఇంకో పాయింటు గుర్తుకు వచ్చింది. ‘‘మీ చెల్లికి ఇలాగే ఇచ్చారా?’’
‘‘అవును నాదీ, మా తమ్ముడిదీ, మా చెల్లెలిదీ సమాన వాటాలు’’
సుధ నోరెత్త లేకపోయింది. తను ఓడిపోతున్నట్లు అనిపించి ఒక్కసారి వీపు చరచుకొంది. విషయాన్ని జనరలైజ్చేసి ‘‘అంటే తండ్రికి అప్పులుంటే అవి కూతురి నెత్తిన కూడా పడాలంటారా? అలా అయితే వాళ్లని చేసుకొనేందుకు ముందుకెవరొస్తారు?’’
‘‘అందుకు యిష్టపడినవాళ్లే వస్తారు. తన స్థాయికి మించిన దానిని ఎవ్వరూ అందుకోలేరు కదా! అయినా తండ్రి అప్పులు కొడుకు ఒక్కడే ఎందుకు భరించాలి? అక్కడ మాత్రం స్త్రీ పురుషులు సమానం కాదా?’’
సుధకు తన ఓటమిని అంగీకరించక తప్పలేదు. అయినా బిల్లు చెల్లించి బయటకు వస్తుంటే ‘‘అయిదు లక్షల మీద ఆశతోనే నన్ను చేసుకొందా మనుకొన్నారన్నమాట’’ అంది కసి తీరక.
‘‘అదేంకాదు. నెల్లాళ్ల క్రిందట ఓ సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి వాటాకు ఏభైవేలు మాత్రమే వస్తుందన్నారు. నేను ఒప్పుకొన్నాను. కానీ నక్షత్రాలు కుదరలేదని చెప్పి వాళ్లే వెళ్లిపోయారు’’ అన్నాడు మధు శాంతం చెడకుండానే.
బాంక్ ఎదురుగా ఆటో ఎక్కిస్తూ ‘‘మీ రాకకు చాలా థాంక్స్. ఆవేశపడకుండా ఆలోచించి మీ నిర్ణయం వారం రోజుల్లో తెలియజేయండి’’ అన్నాడు.
ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర సుధ తను మధు దగ్గరకి వెళ్లిన విషయం బయటపెట్టింది. జరిగిన సంభాషణ వింటూనే సుధీర్ ఉగ్రుడైపోయాడు. ‘‘రాస్కెల్ ఎంత గ్రీడీ ఫెలో వీడు, మనిషి చూస్తే అలా ఉన్నాడు కాని’’ అంటూ.
హైమావతి కూడా ఆవేశపడింది. ‘‘ఏమిటీ ఇద్దరికీ సమానంగా యివ్వాలా? అబ్బాయి రెక్కలు ముక్కలు చేసుకొని ఫ్యాక్టరీలో పని చేయిస్తూంటే ఈయనగారికి వాటా కావాలా? చాలా బావుంది’’ అని.
సుధ నెమ్మదిగానే ‘‘అన్నయ్య వాటాలో కాదు, నాన్నగారి ఆస్తిలో సమాన భాగం నాకివ్వాలన్నారు’’ అంది. ‘‘నీకంటే వాడికి కాదూ? నీ పేర ఉంటేనేం? మీ ఇద్దరికి, మీ పిల్లలకి పోతుంది కానీ మాకొస్తుందా? కొడుకులతో సమానంగా పెట్టాలా? విడ్డూరంగా ఉంది’’ అంటూ రొప్పుతోంది హైమావతి.
మితభాషి అయిన దయానిధి విసుక్కొన్నారు. ‘‘నువ్వూరుకో అనవసరమైన గొడవ’’ అంటూ. ‘‘ఒరే సుధీర్ ఈ సంబంధం డ్రాప్ చేద్దాం కానీ మీ క్లాస్మేట్ ఎవడో ఉన్నాడన్నావు చూడు’’ అన్నాడు సుధీర్‌తో.
‘‘తప్పకుండానూ, నెల్లాళ్లలో దీన్ని తలదన్నే సంబంధం తెస్తాను’’ అన్నాడు సుధీర్. అతని మొహం వెలిగిపోతోంది. అన్నట్లుగానే పదిరోజులు తిరక్కుండా మంచి సంబంధం తెచ్చాడు కూడా.
‘‘నాన్నా అతను నా ఫ్రెండు. కట్నం మన ఇష్టం వచ్చినంతే యివ్వచ్చు. ఓ లక్ష యిస్తే చాలు’’ అన్నాడు.
దయానిధి, హైమావతి మొహాలు వికసించాయి. ‘‘ఇంకేం, అబ్బాయి బాగుంటే యిదే చేసేద్దాం. లక్ష అంటే ఇబ్బందేముంది’’ అన్నారు దయానిధి సంతోషంగా.
హైమావతి సంతోషం పట్టనలవి కాదు. ‘‘ఇంకా నయం. ఆ బాంక్ వాడి సంబంధం చేసుకున్నాం కాదు, అయిదు లక్షలు కావాల్ట ఆ మొహానికి. ఇతనైతే ఓ లక్షలో తేలిపోతుంది. అమ్మాయి అదృష్టం అంతా.’’
కానీ సుధ సంతోషంగాలేదు. ‘‘నాకీ సంబంధం ఇష్టంలేదు’’ అంది గట్టిగా.
నిజానికి ఈ పదిరోజులూ మధు మాటలగురించి సుధ ఆలోచిస్తూనే ఉంది. వినడానికి కర్కశంగా, ఎబ్బెట్టుగా ఉన్నా అవి నిజాలు. అతను లోకాన్ని చక్కగా అర్థం చేసుకొన్నాడు.
తననంత ప్రేమగా పెంచారు కదా ఆస్తిలో సగం వాటా యివ్వడానికి తల్లిదండ్రులకి అంత బాధ ఎందుకు? దాన్ని గురించి గట్టిగా అడిగినందుకా మధుని ఇన్ని తిట్లు తిడుతున్నారు? మాకు కొడుకు, కూతురూ ఒకటేనంటూనే కూతురి వాటాను కూడా కొడుక్కి యివ్వబోవడమేం?
‘‘నేను మధునే చేసుకొంటాను. నాకీ సంబంధం వద్దు’’ అని సుధ దాదాపు అరిచింది.
అందరూ నిర్విణ్ణులయ్యేరు. ‘‘వాడెందుకూ? ఇదయితే నాలుగు లక్షలు మిగులుతాయిగా’’ అన్నారు దయానిధి.
సుధ పళ్లు బిగపట్టి, ‘‘ఎవరికి?’’ అంది.
దయానిధికి అంతా అర్థమయింది. తెలివైనవాడు కాబట్టి క్షణంలో విషయం గ్రహించేరు. అందుకే ఆవేశపడుతున్న హైమావతిని, సుధీర్‌ని ఆపి ‘‘కానీ, వద్దని కబురుచేసాంగా’’ అన్నారు తెలివిగా.
‘‘నేనూ ఇందాకనే ఫోన్ చేశాను. ఆయన ఒప్పుకొన్నారు’’ అంది సుధ సమాధానంగా.
దయానిధి, హైమావతి, సుధీర్ల కోపం పట్టనలవి కాకుండా ఉంది. ఏమనడానికీ తోచడం లేదు. అందరికంటె నష్టపోయేది సుధీర్ కాబట్టి అతను బయటకు కక్కాడు. ‘‘కాలేజీలో కట్నం తీసుకోనివాడినే చేసుకొంటానని బీరాలు పలికి ఇప్పుడిలా అయిదు లక్షలు కట్నం యివ్వడానికి సిగ్గులేదూ’’ అంటూ అరిచేడు.
‘‘అన్నయ్యా, మైండ్ యూ, ఇది కట్నం కాదు, ఆస్తిలో నా వాటా’’ అంది సుధ దృఢంగా!
మరొక స్వీయానువాద కథ వచ్చే నెలలో…
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)