శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే పశు సంవర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు మాజీ మంత్రి అవుతారా. అర్జంటుగా వచ్చి సీఎం జగన్‌ని కలవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రిగారికి పిలుపు రావడంతో ఆయన అనుచరులల్లో హై బీపీ రైజ్ అయింది.
అప్పలరాజు తొలిసారిగా పలాస నుంచి గెలిచారు ఆయన అంతకు ముందు డాక్టర్ గా ఉంటూ వచ్చారు. 2017లో జగన్ పాదయాత్ర టైం లో ఆయనతో కలసి అడుగులు వేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు రెండేళ్ళు తిరగకుండానే ఎమ్మెల్యే అయ్యారు. 2020లో మంత్రి పదవిని సైతం అందుకున్నారు.
రెండవ విడత మంత్రి వర్గ విస్తరణలో కూడా ఆయన మంత్రి పదవికి ముప్పు రాలేదు. దాంతో పూర్తి కాలం ఆయన మంత్రిగా ఉంటారని అనుచరులు సంతోషించారు. ఇపుడు ఉన్నట్లుండి సీఎం ఆఫీస్ నుంచి అర్జంట్ ఫోన్ కాల్ రావడంతో తన పనులు అన్నీ రద్దు చేసుకుని మంత్రి గారు తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు.
తొందరలో మంత్రి వర్గ విస్తరణ జరగనుంది అని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన తప్పదని కొత్తగా నలుగురి నుంచి అయిదుగురు దాకా తీసుకుంటారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. దాంతో అప్పలరాజుని తప్పిస్తారు అని అంటున్నారు. మంత్రిగా ఆయన పనితీరు మీద అధినాయకత్వం పెద్దగా సంతృప్తి చెందడం లేదని వార్తలు వస్తున్నాయి. పలాసలో ఎన్నికల ఏడాదిలో పూర్తిగా దృష్టి పెట్టి గెలవడానికి వీలుగా మాజీని చేస్తున్నారు అని ఒక వైపు వినిపిస్తోంది.
ఈసారి పలాస టికెట్ కూడా దక్కకపోవచ్చునని సర్వేల ఆధారంగా కొత్త అభ్యర్ధిని బరిలోకి దించుతారని అంటున్నారు. ముందుగా మంత్రి పదవిని తీసుకుంటారని ఎన్నికల వేళ టికెట్ దక్కే చాన్స్ ఉండకపోవచ్చు అని ప్రచారం సాగుతోంది.
ఈ మధ్యనే అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ సామాజిక సమీకరణల సమతూల్యం కోసం ముఖ్యమంత్రి కోరితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అప్పలరాజుకు మాజీని అవుతాను అని తెలుసు అని ఆయన మాటల బట్టే అర్ధం అవుతోంది అని అంటున్నారు. మంత్రిగా శ్రీకాకుళం నుంచి బయల్దేరిన అప్పలరాజు మాజీగా తిరిగి వస్తారా అన్న కలవరం అయితే ఆయన అనుచరులలో ఉంది.