మూడు రోజుల్లో ముగ్గురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు!

యూపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీని వీడుతున్న నేత‌ల జాబితా పెరుగుతూ ఉంది. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు మంత్రులతో స‌హా మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు.…

యూపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీని వీడుతున్న నేత‌ల జాబితా పెరుగుతూ ఉంది. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు మంత్రులతో స‌హా మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు. వీరి దారుల‌న్నీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ స‌మాజ్ వాదీ వైపు సాగుతూ ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌ను కూడా బీజేపీ బాగా బ్యాలెన్స్ చేసుకుంది. అలా బీజేపీ గేమ్ లో అప్పుడు ప‌నికి వ‌చ్చిన వారు ఇప్పుడు ఒక్కొక్క‌రుగా జారి పోతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా బీసీ, ఎస్సీ నినాదాల‌తో బీజేపీకి ఈ నేత‌లు దూరం అవుతూ ఉన్నారు. యోగి ఆదిత్య‌నాథ్ ఐదేళ్ల పాల‌న‌తో బీసీలు, ద‌ళితులు నిరాద‌ర‌ణ‌కు గుర‌య్యార‌నే నినాదాలు చేస్తున్నారు బీజేపీని వీడుతున్న నేత‌లు!

వీరిలో క‌నీసం ఇర‌వై నియోజ‌క‌వ‌ర్గాల‌పై కొద్దో గొప్పో ప్ర‌భావం చూప‌గ‌ల స్వామి ప్ర‌సాద్ మౌర్య‌తో స‌హా ప‌లువురు ఓబీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన ఈ నేత‌ల ద్వారా బీజేపీ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యాల్లో గ‌ట్టిగా నిల‌వ‌గ‌లిగింది. మోడీ మానియాకు తోడు స్థానికంగా అనుకూలించిన ఈ ప‌రిణామాలే బీజేపీని విజేత‌గా నిలిపాయి.

ఇక యూపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డిన నేప‌థ్యంలో బీజేపీ.. య‌థాత‌థంగా హిందుత్వ రాజ‌కీయాన్ని న‌మ్ముకుంది. అభివృద్ధి, శాంతిభ‌ద్ర‌త‌లు అద్భుత‌మంటూ ఇన్నేళ్లూ చెప్పినా.. తీరా ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి రాహుల్ హిందువా కాదా, ఎవ‌రు అస‌లైన హిందువులు.. అనే చ‌ర్చ‌ను ఎత్తారు ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్. ఇక ఎన్నిక‌ల ముందు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తున్న మోడీ అర‌వై యేళ్ల కాంగ్రెస్ పాల‌న అంటూ.. ఎనిమిదేళ్ల కింద‌టి డైలాగులే ఇప్పుడూ వాడుతున్నారు. జాతీయ మీడియా వ‌ర్గాలేమో బీజేపీదే విజ‌యం అంటూ వ‌ర‌స స‌ర్వేల వార్త‌లు ఇస్తున్నాయి. ఇంత వ‌ర‌కూ ఇవే హైలెట్ కాగా.. ఎన్నిక‌ల షెడ్యూల్ రాగానే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు సాగుతున్న వ‌ల‌స‌లు స‌ల‌స‌లమంటున్నాయి!