ఎవరైనా ఆలయానికి వెళ్తే తమ గురించి తమ కుటుంబం గురించి ప్రార్ధిస్తారు. మొక్కులు కూడా మొక్కుతారు. కానీ ఏపీ స్పీకర్, సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ అయిన తమ్మినేని సీతారామ్ మాత్రం జగన్ కోసం మొక్కుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేళ ఆయన ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని సమస్యలను ధీటుగా ఎదుర్కొనేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని మొక్కుకున్నట్లుగా చెప్పారు. ఏపీలో జగన్ అందరినీ సమ దృష్టితో చూస్తున్నారని, ఆయన ప్రతీ ఒక్కరినీ ఆదిరిస్తూ పూర్తి న్యాయం చేస్తున్నారని తమ్మినేని పొగిడారు.
అలాంటి ముఖ్యమంత్రి జగన్ పరిపాలన సజావుగా సాగేలా చూడాలని, ఆటంకాలను ఎదుర్కొనే శక్తిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని కోరుకున్నట్లుగా తమ్మినేని వంటి సీనియర్ చెప్పడం విశేషంగానే చూడాలి.ఇక మనిషి ఏ స్థాయికి చేరుకున్న పుట్టిన నేలను, కన్నతల్లిని, దైవాన్ని గుర్తించి మొక్కకపోతే ఫినిష్ అయిపోతారంటూ తమ్మినేని సంచలన కామెంట్స్ చేశారు.
ప్రతీ వారిలో దైవభక్తి ఉండాలని, అలాగే సనాతన ధర్మాన్ని అంతా పాటించాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. అంతకు ముందు సంప్రదాయబద్ధంగా ఆయన పూజలు చేశారు. మొక్కులు చెల్లించారు.