క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ సమరం నేటి నుండి ప్రారంభం కానుంది. నేటి నుండి రెండు నెలల పాటు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 10 ప్రాంచైజీలు ఈ ఐపీఎల్లో సందడి చేయనున్నాయి. తొలి మ్యాచ్ లో రా. 7.30 గంటలకు గుజరాత్, చెన్నై తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
లీగ్ దశలో 70, ప్లేఆఫ్స్ లో 4 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్‌ను టాటా కంపెనీ స్పాన్సర్ చేసింది. నేటి నుండి మ్యాచ్‌ను ప్రారంభం కాబోతుండటంతో ప్రారంభ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐపీఎల్ ఆరంభ వేడుకలు మొదలుకానున్నాయి. ఈ వేడుకల్లో తమన్నా, రష్మిక మందన్నతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ డ్యాన్స్‌లతో అభిమానులను అలరించబోతున్నారు.
గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్ గా నిలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో ఈసారి మాత్రం గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల మీద చెన్నై ఉంది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. తమ కెప్టెన్ ఎంఎస్ ధోనికి టైటిల్ గిఫ్ట్‌గా ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తోంది.