తమిళ డైరెక్టర్ పా.రంజిత్‌ది ఒక ప్రత్యేకమైన శైలి. నేటివిటీ మిస్ అవకుండా రాజకీయాలు, క్యాస్ట్ డైనమిక్స్ కలిపి బిగి సడలకుండా కథ చెబుతాడు. దసరా డైరెక్టర్ శ్రీకాంత్‌కి ఆ లక్షణం వుంది. సెకెండాఫ్‌లో కొంచెం తడబడి రొటీన్ క్లైమాక్స్లోకి వెళ్లినప్పటికీ, మూడ్ క్రియేషన్‌తో పాటు, కెమెరా, సంగీతం నుంచి అనుకున్న రిజల్ట్ రాబట్టడంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు.
దసరా చూస్తున్నప్పుడు రంగస్థలం గుర్తుకు రావడం నిజమే కానీ, దసరా టెంప్లెట్ తమిళ సినిమా మద్రాస్‌కి మ్యాచ్ అవుతుంది. పా.రంజిత్ 2014లో మద్రాస్ తీశాడు. ఇది కాళి (కార్తి) అన్బు (కలైయారాసన్) అనే స్నేహితుల కథ. ఉత్తర మద్రాస్‌లో ఒక హౌసింగ్ కాలనీ, అక్కడ ఒక గోడ. దాని మీద ఎవరి నాయకుల బొమ్మలుండాలనే విషయంపై వివాదం. ఇద్దరు లోకల్ లీడర్ల మధ్య గొడవ.
దసరాలో ధరణి, సూరి స్నేహితులు. బొగ్గు గనుల ప్రాంతంలోని వీర్లపల్లె అనే ఊరు. అక్కడ ఒక బార్. దాని మీద పెత్తనం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ. స్నేహితులు ఇద్దరు ఒక వర్గానికి అనుచరులుగా మారుతారు. అవతల వర్గం పగ పడుతుంది.
మద్రాస్‌లో కూడా ఇదే కథ. చివర్లో గోడని శుభ్రం చేస్తారు. దసరాలో బార్ని తగలబెడతారు. దీంట్లో అదనంగా ముక్కోణపు ప్రేమ కథ వచ్చి చేరింది. అదే సెకెండాఫ్‌ని నెమ్మది చేసింది.
నాని మంచి నటుడు అని కొత్తగా చెప్పాల్సింది లేదు. ప్లాప్ సినిమాల్లో కూడా ఆయన వరకూ అద్భుతంగా నటిస్తాడు. దసరాలో పూర్తిగా వేరే నాని కనిపిస్తాడు. నెక్ట్స్ లెవెల్ అంటారే అది.
బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నా, ఈ కథకి , గనులకి ఏ సంబంధం లేదు. ఇది ఎక్కడైనా జరగొచ్చు. సినిమా మొత్తం బొగ్గు గనుల పల్లెటూరులో ప్రేక్షకున్ని కూచోపెట్టడం మాటలు కాదు. ఆ పని దర్శకుడు సులభంగా చేసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ షాక్‌కి గురి చేస్తుంది. మనకి కాసేపు బయటికి వెళ్లాలనిపించదు. సెకెండాఫ్‌లో ఏం చూడబోతామో అని భయమేస్తుంది. మంచి సినిమా లక్షణం ఇది. సెకెండాఫ్ బిగినింగ్‌లోని ట్విస్ట్ కూడా షాకింగ్‌గానే వుంది. తర్వాత కథలో ఇంకో లేయర్ అవసరం. అది మరిచిపోయి ప్లాట్‌గా, ఊహించడానికి అనువుగా రాసుకోవడం దర్శకుడి లోపం.
రంగస్థలం కూడా ఫస్ట్ డినైడ్ టాక్ వచ్చి, మళ్లీ పైకి లేచింది. దసరాకి కూడా అలాగే జరిగితే శ్రీకాంత్, నానిల అదృష్టం. పాన్ ఇండియా సినిమా తీయాలనే ప్రయత్నమైతే నిజాయతీగానే జరిగింది.
కథ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే మనం గర్వంగా చెప్పుకునే దర్శకుల్లో శ్రీకాంత్ ఒకడవుతాడు. తెలుగు తెరపై కనిపించే పేరుగా మారుతాడు.
జీఆర్ మహర్షి