మూడు రాజధానుల బిల్లులపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇచ్చినా, జగన్ మాత్రం తగ్గేదే లే అంటున్న సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత ఏ క్షణమైనా విశాఖ నుంచి పాలన సాగిస్తామని మంత్రులు పదేపదే చెబుతున్నారు. అలాగే పారిశ్రామికవేత్తల సదస్సులో త్వరలో తాను కూడా విశాఖకు రానున్నారని, ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై విచారణ మరింత జాప్యం అవుతూనే వుంది.
ఈ నేపథ్యంలో రాజధాని విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంకు పట్టు వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని ఉద్యమంగా ఆయన అభివర్ణించడం గమనార్హం.
తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టారని రామకృష్ణ విమర్శించారు. అయితే అధికారం చేతిలోకి రాగానే మాట మార్చి, మడం తిప్పి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతు న్నారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇదిలా వుండగా చేయని ఉద్యమం 1200 రోజులు ఎలా పూర్తి చేసుకున్నదో రామకృష్ణకే తెలియాలి.
అరసవెల్లి వరకూ చేపట్టిన పాదయాత్రను కూడా పూర్తి చేయని దుస్థితి. అలాంటిది లేని ఉద్యమం ఉన్నట్టు, అదేదో మహా గొప్పదైనట్టు రామకృష్ణ చెప్పడం ఆయనకే చెల్లింది. ఇలా లేనిదానికి అనవసర ప్రాధాన్యం ఇవ్వడానికి సీపీఐ రామకృష్ణ తన వంతు కృషి చేస్తున్నారు. పైగా రాజధాని అంశాన్ని టీడీపీనే విడిచి పెట్టినప్పటికీ, సీపీఐ మాత్రం ఇంకా మోయడం ఎవరి కోసం? ఎందుకోసం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.