గత ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద ప్రతి నిమిషమూ విషం చిమ్ముతున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పచ్చమీడియాపై ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఎలాంటి శషబిషలకూ తావులేకుండా తన శత్రువులకు ‘దుష్ట చతుష్టయం’ అని నామకరణం చేసి యుద్ధం సాగిస్తున్నారు. ‘మనం పోరాడుతున్నది ఒక తెలుగుదేశం పార్టీతో మాత్రమే కాదు. ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టివి 5తో, చంద్రబాబు దత్తపుత్రునితో పోరాడుతున్నాం’ అని ప్రతి సభలోనూ జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా చెబుతూనే ఉన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రోజూ కొన్ని పార్టీల నాయకులతోనూ, మీడియా యాజమాన్యాలతోనూ ధర్మారెడ్డి తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. ప్రభుత్వం మీద కస్సుమనే ఈ దుష్టచతుష్టయం ధర్మారెడ్డి మీద మాత్రం ఈగ వాలకుండా చూసుకుంటోంది. తిరుమల శ్రీవారి వల్ల లభించిన ‘పవర్’ను ధర్మారెడ్డి ఆ విధంగా వినియోగిస్తున్నారు మరి. ధర్మారెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఏ కాంగ్రెస్ నాయకుడో, ఏ బిజెపి నాయకుడో స్పందిస్తుంటారు. పచ్చమీడియాలో కూడా ధర్మారెడ్డిని సమర్ధిస్తూ కథనాలు ప్రచురితమవుతాయి. తన పలుకుబడితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు వ్యతిరేకంగా కూడా పచ్చ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యేలా, ప్రసారమయ్యేలా చేస్తారు. అదీ ధర్మమైన ఘనత.
కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తిరుమల దర్శనానికి వచ్చారు. తమ పట్ల ఈవో ధర్మారెడ్డి అవమానకరంగా వ్యవహరించారని సదరు ఎమ్మెల్యే మీడియా ముందు తన గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే స్థానిక (తిరుపతి)బీజేపీ నాయకుడు స్పందించారు ‘టీటీడీ ఏమైనా వైసీపీ కార్యాలయమా…మీకు అన్ని మర్యాదలు చేసేందుకు’ అంటూ ఆ బీజేపీ నాయకుడు `ధర్మారెడ్డి తరపు వకల్తా పుచ్చుకుని మాట్లాడారు. దీనికి ముందు ఇటువంటి వివాదమే ఒకటొస్తే….‘ధర్మారెడ్డి మంచి అధికారి…ఆయన గురించి అలా మాట్లాడటం తగదు’ అంటూ ఎప్పుడూ జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేసే తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ …ధర్మారెడ్డిని వెనుకేసుకొచ్చారు.
ఆ మధ్య వరుసగా రెండు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర మంత్రులు తమ బంధువులతో తిరుమలకు వచ్చారు. దర్శనం టికెట్లు అడిగారు. ఈవో ధర్మారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే రెండో రోజు పచ్చ మీడియాలో ఆ మంత్రులకు వ్యతిరేకంగా వార్తలొచ్చాయి. అధికార పార్టీ నాయకులా, ప్రతిపక్ష నేతలా, వ్యక్తులా అనేదానితో నిమిత్తం లేదు. ధర్మారెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆయన తరపున పచ్చ మీడియా రంగంలోకి దిగుతుంది. ధర్మారెడ్డి వెనకాల వుండి జరగాల్సింది జరిపించేస్తారు.
అంతెందుకు….ఒకసారి వైకుంఠ ఏకాదశికి దర్శనంలో తీవ్రమైన జాప్యం జరిగింది. విసిగిపోయిన భక్తులు ఆలయం ఎదుట ఈవో ధర్మారెడ్డికి, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనదైన శైలిలో పావులు కదిపిన ధర్మారెడ్డి…ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడి ‘ఈవో ధర్మారెడ్డి డౌన్ డౌన్’ అంటూ భక్తులు చేసిన నినాదాలు ప్రసారం కాకుండా ‘జాగ్రత్త’పడ్డారు. ‘చైర్మన్ డౌన్ డౌన్’ అని మాత్రం టీవీ దృశ్యాల్లో కనిపించాయి.
తనకు వ్యతిరేకమైన దృశ్యాలను టీవీల్లో ప్రసారం కాకుండా ఆపించుకోగలిగిన ధర్మారెడ్డి చైర్మన్ విషయంలోనూ అలా ఎందుకు చేయలేకపోయారు? మార్గం లేకనా? లేక మనసు లేకనా? టీటీడీ బోర్డు సభ్యులపైనా ఇలాంటి వ్యతిరేక వార్తలు పచ్చ మీడియాలో అప్పడప్పుడూ వస్తుంటాయి. వీటన్నింటి వెనుకా ‘ధర్మ’హస్తం వుంటుందన్నది బహిరంగ రహస్యం.
తనకు అధికారం అప్పగించిన అధికార పార్టీ నాయకులపైనా, ఆఖరికి టీటీడీ బోర్డు చైర్మన్‌పైనా, బోర్డు సభ్యులపైనా పచ్చ మీడియాను, తనకు అనుకూలురైన ప్రతిపక్ష పార్టీల నేతలను ఉసిగొల్పే చర్యలలో ధర్మారెడ్డి ఆరితేరిపోయారు. దీంతో మంత్రులైనా, అధికార పార్టీలో పెద్ద నాయకులైనా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నోరు మెదపాలంటే హడలిపోతున్నారు.
అయినదానికి కానిదానికి జగన్ మీద విరుచుకుపడే పచ్చ మీడియా, టీడీపీ, కాంగ్రెస్, జనసేన తదితర పార్టీల ప్రతినిధులు తిరుమల ధర్మారెడ్డి మీద మాత్రం ఎందుకంత ప్రేమ వలకబోస్తున్నారు? ఇందులో రహస్యమేమీ లేదు. దర్శనాలే. అధికార పార్టీ నేతలు దర్శనాల కోసం లెటర్లు పెడితే…వాటిపై శల్యపరీక్షలు చేసి, ఎన్ని తిరస్కరించాలో అన్నింటినీ తిరస్కరించే ధర్మారెడ్డి….పచ్చమీడియా పెట్టే లేఖలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరు. ప్రతిపక్ష నేతలు పెట్టే లేఖలకు మొదటి ప్రాధాన్యతలోనే టికెట్లు కేటాయిస్తారు. ఇలాంటి వైఖరే ఇప్పుడు అధికార పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది.
జగన్ ప్రకటిత శత్రువులతో ధర్మారెడ్డి చెట్టపట్టాల్ వేసుకుంటే, జగన్‌తో సహా అధికార పార్టీ నాయకులు ఆ శత్రువుల దాడికి గురవుతున్నారు. ఈ విచిత్ర పరిస్థితిని ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా అన్వయించుకుంటారో చూడాలి.