మాస్ మీటర్ ఓకే.. మాస్ పల్స్ సంగతేంటి?

కొత్తగా వచ్చాడు, కొత్తదనం చూపించాడు. డిఫరెంట్ గా వెళ్తున్నాడని అనిపించుకున్నాడు. అలా వెళ్తూ, వెళ్తూ మాస్ రూటులోకి వచ్చేశాడు కిరణ్ అబ్బవరం. గడిచిన 2 సినిమాల నుంచే ఆ దిశగా అడుగులు వేసిన ఈ…

కొత్తగా వచ్చాడు, కొత్తదనం చూపించాడు. డిఫరెంట్ గా వెళ్తున్నాడని అనిపించుకున్నాడు. అలా వెళ్తూ, వెళ్తూ మాస్ రూటులోకి వచ్చేశాడు కిరణ్ అబ్బవరం. గడిచిన 2 సినిమాల నుంచే ఆ దిశగా అడుగులు వేసిన ఈ హీరో, ఈసారి మీటర్ అనే సినిమాతో పూర్తిస్థాయిలో మాస్ లోకి దిగిపోయాడు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

ఎలాంటి కొత్తదనం లేదు, కొలతల్లేవు. పూర్తిగా మాస్ మసాలా అంశాలు, హీరోయిజం, ఎలివేషన్స్ తో సినిమాను నింపేశారనే అంశం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. బాలకృష్ణ, చిరంజీవి, రవితేజ లాంటి మాస్ హీరోలు ఎలాంటి కథలు చేయాలని ఆడియన్స్ కోరుకుంటారో, అలాంటి కథతో కిరణ్ అబ్బవరం రెడీ అయిపోయాడు.

మీటర్ ట్రయిలర్ లో మచ్చుకు కూడా కొత్తదనం లేదు. పూర్తిగా మాస్ మాసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేశారు. ఈ జానర్ లో కథను దాచడం అనవసరం. అందుకే చూచాయగా కథ ఏంటనేది కూడా చెప్పేశారు. చివరికి హీరోగారి లవ్ ట్రాక్ కూడా మాస్..మాస్ గానే ఉంది తప్ప, అందులో సున్నితత్వం కనిపించలేదు.

ఇలా కంప్లీట్ మసాలాతో వస్తున్న మీటర్ సినిమా, మాస్ పల్స్ ను పట్టుకుంటుందా లేదా తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.

అన్నట్టు ఈమధ్య క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఊరమాస్ సినిమాలు థియేటర్లలో బాగానే పెర్ఫార్మ్ చేశాయి. మరి థియేటర్లలో ఈ 'మీటర్' రైజ్ అవుతుందో లేక డౌన్ అవుతుందో చూడాలి.