గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్సెస్ మంత్రి అంబటి రాంబాబు అన్నట్టుగా తిరుమలేశుని ప్రొటోకాల్ దర్శన వ్యవహారం దారి తీసింది. ఇద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే కావడం విశేషం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెత్తు పోకడలకు పోతూ ఎమ్మెల్యేలకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని అన్నా రాంబాబు ఘాటు విమర్శలు రాజకీయంగా దుమారం రేపాయి. టీటీడీ ఈవోపై అన్నా రాంబాబు విమర్శలను మంత్రి రాంబాబు తప్పు పట్టడం చర్చనీయాంశమైంది.
ముందుగా వివాదానికి దారి తీసిన గిద్దలూరు ఎమ్మెల్యే విమర్శలేంటో తెలుసుకుందాం. గతంలో తిరుమలలో ఎమ్మెల్యేలకు చాలా గౌరవమర్యాదలుండేవన్నారు. కానీ ఈ రోజు టీటీడీ ఈవో, ఆయన అధికారులు ఒంటెత్తుపోకడలకు పోతూ ఎమ్మెల్యేలను అగౌరవపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమీ తన సొంత ఎస్టేట్ కాదని, ఆయన ఆస్తి కాదని ఈవో గ్రహించాలని రాంబాబు ఆగ్రహంతో హితవు చెప్పారు. ఈవో కూడా ఒక ఉద్యోగి మాత్రమే అని అన్నారు. సీఎంవో నుంచి తన భార్య పేరుతో సిఫార్సు లేఖ తీసుకొస్తే దాన్ని జనరల్‌లో వేశారని మండిపడ్డారు. సామాన్య భక్తుల కోసం పారదర్శకంగా పని చేస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు.
బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిద్దలూరు ఎమ్మెల్యే టీటీడీపై విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. అన్నా రాంబాబు విమర్శలు నూటికి నూరుపాళ్లు తప్పు అని తేల్చి చెప్పారు. దైవ సన్నిధిలో అన్నా రాంబాబు పొరపాటుగా మాట్లాడి వుంటారని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
భగవంతుడు అన్ని నిర్ణయిస్తారన్నారు. ఇక్కడ అధికార పక్షమా, విపక్షమా అనేది ప్రస్తావన కాదన్నారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు కూడా తన ప్రొటోకాల్ తనకు ఇచ్చారన్నారు. భగవంతుని దగ్గర విపక్షం, స్వపక్షం అనేది లేదన్నారు. చిన్నచిన్న వాటిని రాజకీయం చేయడం చాలా తప్పన్నారు. అలాంటి వాటిని భగవంతుడు క్షమించరన్నారు.
ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు టీటీడీ ఈవోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మాత్రం ఈవోను తప్పు పడుతుంటే, మంత్రి వెనకేసుకొచ్చారు. బహుశా అన్నా రాంబాబు విమర్శలతో టీటీడీ ఈవో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు గౌరవమర్యాదలు ఇస్తున్నట్టున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.