మూడు రాజధానులు – మూడు ఆటంకాలు

రాజధాని కేసును సుప్రీంకోర్టు దాదాపు నాలుగు నెలలు సుదీర్ఘ వాయిదా వేసింది. ఈలోపు ధర్మాసనం సీనియర్ న్యాయమూర్తి పదవీ విరమణ కూడా ఉంది. అనంత‌రం కొత్త బెంచ్ ఏర్పాట‌వుతుంది. మొదటి నుంచి వాదనలు విని…

రాజధాని కేసును సుప్రీంకోర్టు దాదాపు నాలుగు నెలలు సుదీర్ఘ వాయిదా వేసింది. ఈలోపు ధర్మాసనం సీనియర్ న్యాయమూర్తి పదవీ విరమణ కూడా ఉంది. అనంత‌రం కొత్త బెంచ్ ఏర్పాట‌వుతుంది. మొదటి నుంచి వాదనలు విని తీర్పు వెలువరించేలోపు ఎన్నికలు సమీపిప్తాయి. మొత్తంగా ఈ సమస్య రాజకీయంగా వైసీపీ మెడకు చుట్టుకుని, మూల్యం చెల్లించుకునే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఈ సమస్య జఠిలం కావడానికి వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా కనిపిస్తోంది.

1. అమరావతి ప్రాజెక్టును సమీక్షించ‌కుండా మూడు రాజధానుల ఆలోచనః

ఒక ప్రభుత్వం అధికారికంగా  నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి చట్టబద్ధ‌త‌ ఏర్పడుతుంది. అలాగని అదేమీ శిలాశాసనం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని రాజధాని ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణం తప్ప రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కాకపోతే ఆ ప్రాజెక్టుకు రైతుల నుంచి భూముల తీసుకున్నందున వారి ప్రయోజనాలకు చట్ట బద్ధత ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తూ మూడు రాజధానులు ఆలోచన చేయడం మంచి నిర్ణయం.

ఈ క్రమంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి GN రావు కమిషన్, బోస్టన్ కన్సల్టెంట్స్ ను నియమించింది. త‌న ఆలోచనలకు అనుగుణంగా కమిటీ వేసిందే గానీ, గత ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై పరిశీలించ‌లేదు.  

ఏ కారణంగా ఆ ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేయాలని సంకల్పించామో ప్ర‌భుత్వం అధికారిక ప్రయత్నాలు చేయలేదు. అలాంట‌ప్పుడు సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధ‌ప‌డ‌డం ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు. కమిటీ వేసి నిర్ణయం తీసుకుని ఉంటే న్యాయపరమైన సమస్యలు వచ్చేవి కావు. రైతుల ఆర్థిక ప్రయోజనాల వరకే న్యాయస్థానాలు పరిమితమై  ఉండేవి.

2. సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఏదీ?

గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు రద్దు, మార్పులు చేర్పులు చేసే అధికారం వర్తమాన ప్రభుత్వానికి ఉంటుంది. కాకపోతే గత ప్రభుత్వాలు చేసిన చట్టాల్లోని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అమరావతి రాజధాని ఎంపిక, ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి శివరామకృష్ణన్ రాసిన లేఖ  వ్యతిరేకంగా ఉన్నాయి. 

గత ప్రభుత్వం రూపొందించిన రాజధాని ప్రాజెక్టును అమలు చేస్తే ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని శివరామకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ శివ‌రామ‌కృష్ణ‌న్ అలాంటి నిర్దారణకొస్తే, ఆ ప్రాజెక్టును తాము అమలు చేయలేమని, అది రాష్ట్ర భవితవ్యం మీద ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వానికి గానీ, న్యాయ వ్యవస్థలకు గాని ఏనాడు చెప్పిన పాపాన పోలేదు వైసీపీ ప్రభుత్వం.

రాజకీయ విమర్శలు మాత్రం ప్రతి రోజూ చేస్తున్నారు. అంతెందుకు అమరావతి నేతలు, వారిని వెనకేసుకొస్తున్న మీడియా, రాజ‌కీయ పార్టీలు బ‌లంగా చేస్తున్న వాద‌నేంటో తెలుసుకుందాం. 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం  భారీగా నిధులు ఖర్చు అవుతుంద‌ని, తాము త్యాగం చేశామ‌ని, పెడితే రాజధాని పెట్టాలి లేదా భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. విచిత్రం ఏమంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అమరావతి ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం ఎందుకంటే సెక్ష‌న్  10 ప్రకారం బహుళ పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. 

ఒక వేళ‌ తీసుకోవాల‌నుకుంటే సేకరించిన భూమితో సహా మొత్తంగా 52 వేల ఎకరాలకు సమాంతరంగా నిరుపయోగమైన‌, వ్యవసాయోగ్య భూమిని అభివృద్ధి చేయాలి. ఈ నిబంధనలు పాటించకుండా గ‌త ప్ర‌భుత్వం భూమిని సేకరించింది. 2013 భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కోర్టులో గాని సాధికారిక సంస్థల వద్ద ఎలాంటి  ప్రయత్నాలు చేయలేదు. చివరకు 1872 కాంట్రాక్టు చట్టం ఒకటి ఉన్నదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం గ‌మ‌నార్హం. దాని ఫలితమే నేడు సదుద్దేశంతో తీసుకున్న వికేంద్రీకరణ ఆలోచన న్యాయస్థానంలో ప్రశ్నలకు గురవుతోంది.

3. ప్రజల మద్దతు కూడగట్టడంలో వైఫల్యం

న్యాయ పరమైన అంశాలు ఒక ఎత్తు అయితే, ప్రజల మద్దతు అత్యంత కిలకం. ఈ విషయంలో వైసీపీ లెక్కలేని తనంతో వ్యవహరిస్తోంది. దేశానికి, రాష్టానికి ఒక రాజధాని ఉండటం సహజం. ప్రజలు అలాంటి అభిప్రాయంతోనే ఉంటారు. మూడు రాజధానులు, రాజధాని మార్పు అన్నది కొత్త ఆలోచన. 

తాము ఏ పరిస్థితులలో రాజధానిలో మార్పులు చేర్పులు చేస్తున్నామో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పాలనా యంత్రాంగం మూడు ప్రాంతాల్లో ఏర్పాటు ఎలా సాధ్యమో శివరామకృష్ణన్ లాంటి అనుభవం ఉన్నవారు చెప్పింది ఏమిటి లాంటి అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మినహా… ప్రజలకు ముఖ్యంగా  ఆలోచనా పరులకు వివరించే ప్రయత్నం చేయలేదు. 

ప్రభుత్వ యంత్రాంగం, విద్యాసంస్థలు చేతిలో పెట్టుకుని కూడా తమ అభిమాతాన్ని సమాజం ముందు పెట్టె కనీస ప్రయత్నాలు చేయలేదు. ఏమైనా చేశారు అంటే నిర్వాహకులకు కూడా అర్థం కానీ గ‌ర్జనలు. అది కూడా అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్నప్పుడు వారికి పోటీగా మాత్ర‌మే అని గ్ర‌హించాలి.

ఫలితంగా ఉత్తరాంధ్రలో స్పందన అంతంత మాత్రమే. రాయలసీమలో రాజధాని ఆకాంక్ష స్పష్టంగా ఉంది. అంటే చారిత్రక నేపథ్యం రాయలసీమ ఉద్యమ సంస్థల కృషి మినహా మరొకటి కాదు. రాజధాని ఆకాంక్ష ఉన్న రాయలసీమకు కేవలం హైకోర్టు ప్రతిపాదించిన ప్రభుత్వం న్యాయ స్వభావం కలిగి ఉన్న KRMB కార్యాలయాన్ని కర్నూలలో కాకుండా సంబంధం లేని విశాఖలో ఏర్పాటుకు సిద్ధపడ్డారు. అధికార‌ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే… రాయలసీమకు హైకోర్టు, ఉత్తరాంధ్రకు సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ పెట్టడం ద్వారా మూడు ప్రాంతాలు త‌మ‌తో ఉంటాయ‌ని.

ఆ అధికార దర్పంతో వైసీపీ నేత‌లు వ్యవహరించారు. మొత్తం రాజధాని అమరావతిలో పెట్టినా ఆ ప్రాంతంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించారన్న కనీస స్పృహ‌ లేకపోవడం అధికార అహంకారం కాకపోతే మరేంటి? రాజధాని విషయంలో వైసీపీ తన నడకను సమూలంగా మార్చుకోవాలి. రాజధాని అంశం పులిమీద స్వారీ లాంటిది. భావోద్వేగాలతో కూడిన ఈ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరించకపోతే తన మెడకు చుట్టుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి (సమన్వయ‌క‌ర్త‌, రాయలసీమ మేధావుల ఫోరం)