శాకుంతలం సినిమా వాయిదాపడి, ఏప్రిల్ 14కు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా వాయిదా పడినప్పుడు రకరకాల కథనాలు తెరపైకొచ్చాయి. సమంతకు ఆరోగ్యం బాగాలేదని కొంతమంది, సినిమా గ్రాఫిక్స్ పూర్తవ్వలేదని మరికొంతమంది, దిల్ రాజుకు అవుట్-పుట్ నచ్చలేదని ఇంకొంతమంది.. ఇలా తలోవిధంగా రాసుకున్నారు.
ఈ సినిమా వాయిదా పడ్డానికి అసలు కారణం ఇప్పుడు బయటపడింది. శాకుంతలం సినిమా వాయిదాపడ్డానికి పైన చెప్పుకున్నవేవీ కారణం కాదు. కేవలం శిరీష్ వల్ల శాకుంతలం సినిమా వాయిదాపడింది. ఈ విషయాన్ని స్వయంగా గుణశేఖర్ బయటపెట్టాడు.
శాకుంతలం సినిమా చూసిన శిరీష్.. త్రీడీలో కూడా ప్రేక్షకులకు అందించాలని పట్టుబట్టారట. నిత్యం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఉండే శిరీష్ లాంటి వ్యక్తికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుస్తాయని, అలాంటి వ్యక్తి శాకుంతలం త్రీడీలో రావాల్సిందేనంటూ పట్టుబట్టడంతో కాదనలేకపోయామని అన్నారు గుణ.
శిరీష్ వాదనకు దిల్ రాజు కూడా ఓకే చెప్పడంతో శాకుంతలం సినిమా వాయిదా పడినట్టు వెల్లడించాడు గుణశేఖర్. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు కేవలం త్రీడీ వెర్షన్ కోసం మాత్రమే పనిచేశామని, అంతకుమించి మరే ఇతర పనులు పెండింగ్ లో లేవని ఆయన స్పష్టం చేశాడు.