అలీ…తెలుగు సమాజానికి పరిచయం అక్కర్లేని పేరు. సుమారు 53 సినిమాల్లో హీరోగా , తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 1100 సినిమాలకు పైగా కమెడియన్‌గా నటించి, ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందిన అలీ పేరు వింటే చాలు పెదవులపై నవ్వు తాండవిస్తుంది. జుబేదాతో ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఈ నెల 23కు వారి వైవాహిక జీవితానికి 26 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ ఆదర్శ దంపతులు అనేక విషయాలపై మనసు విప్పి మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటంటే…
అప్పటికి జుబేదా పదో తరగతి పాసైంది. మంచి సంబంధం అని చెబితే అలీ తల్లి అమ్మాయిని చూసేందుకు వెళ్లారు. జుబేదాను చూసిన అత్త….తన కొడుక్కి ఈడుజోడు బాగుంటుందని ఓకే చెప్పారు. పెళ్లయ్యే వరకు అలీ, జుబేదా పరస్పరం చూసుకోలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ అది నిజం.
అమ్మాయి నచ్చిందా? అని అమ్మానాన్నలను అడిగానని, నచ్చిందని వారు చెప్పడంతో మరో ఆలోచన లేకుండా పెళ్లి చేసుకున్నానని అలీ చెప్పారు. తమ పెళ్లి 26 ఏళ్ల క్రితం జనవరి 23న జరిగినట్టు దంపతులిద్దరూ చెప్పారు. పెళ్లయ్యాక ఫిబ్రవరి 11న ‘యమలీల’లో హీరో పాత్ర చేసే అవకాశాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇచ్చినట్టు అలీ చెప్పారు. తన జీవితంలో భార్య ఎంట్రీతో అన్ని కలిసొచ్చాయన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 28న సినిమా విడుదలైందని, హిట్ సాధించిందని చెప్పారు.
ఇన్నేళ్లుగా అమ్మతో కలిసి ఉంటున్న మీకు అవార్డు ఇవ్వాలని వాళ్ల నాన్నతో పెద్దమ్మాయి సరదాగా అంటుందని జుబేదా నవ్వుతో చెప్పుకొచ్చారు. ‘ మొగుడిని కొంగుకి కట్టేసుకోవాలంటే వంట ఒక్కటే మార్గమని మా అత్త చెప్పారు. ఆమే స్వయంగా వంటలన్నీ నేర్పించారు. అంత వరకు నాకు వంట చేయడం అలవాటు లేదు ’ అని జుబేదా వంట రహస్యాన్నివెల్లడించారు.
తమకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకని చెప్పారు. కొడుక్కి నాన్న అబ్దుల్ సుభాన్ పేరు పెట్టుకున్నట్టు అలీ తెలిపారు. తమ పెద్ద కుమార్తె ఫాతిమాకి డాక్టర్ కావాలని బలమైన కోరికని, దాన్ని తీర్చేందుకు ప్రోత్సహిస్తున్నామని, ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు అలీ తెలిపారు.
‘అలీకి, శుభశ్రీకి పెళ్లయిందనే వార్తను తారా సితార అనే మ్యాగజీన్‌లో చదివి ఆందోళన చెందాను. పెళ్లయిన తర్వాత అత్తారింటి నుంచి అమ్మానాన్న నన్ను తీసుకెళ్లిన సందర్భంలో ఈ వార్త కుటుంబ సభ్యుల కంట పడింది. దీంతో నాన్న బాగా కంగారు పడ్డాడు., పుట్టింటికి తీసుకెళ్లగానే అల్లుడు ఇలాంటి పని చేస్తాడా అని నాన్న ఆవేదన వ్యక్తం చేశాడు. బట్టలు సర్దుకోవాలని, అలీ ఇంటికి వెళ్లిపోదామని నాన్న అన్నాడు’ అంటూ విషయాలను జుబేదా గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అలీ నవ్వుతూ భార్యను ప్రోత్సహించారు. దీంతో ఆమె మిగిలిన విషయాలను కూడా ఉత్సాహంగా చెప్పారు.
నాన్న చెప్పినట్టే మరుసటి రోజు అలీ దగ్గరికి వెళ్లానన్నారు. కాలింగ్ బెల్ కొట్టగానే మా ఆయనే డోర్ తీశారని తెలిపారు. ‘నిన్నే కదా వెళ్లావ్. అప్పుడే వచ్చావే’ అని ఆశ్చర్యపోతూ అడిగారు. మా ఆయన మాటలేవీ పట్టించుకోకుండా శుభశ్రీ ఎక్కడ అని ఆవేశంతో ప్రశ్నిస్తూ ,ఇల్లంతా వెతికినట్టు పేర్కొన్నారు.
ఏం వెతుకుతున్నావని ఆయన ప్రశ్నించారని ముసిముసిగా నవ్వుతూ జుబేదా తెలిపారు. అప్పుడు తార సితారలో చూసిన ఫొటో, పెళ్లి వివరాలను చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయారని ఆమె తెలిపారు. బాగా చదివావా అని నవ్వుతూ పేపర్ చూపించి షూటింగ్‌లో పెళ్లి సీన్ అని రాసిన విషయాన్ని చూడని తన అజ్ఞానాన్ని తిట్టుకున్నట్టు జుబేదా వివరించారు. ఇలా 26 ఏళ్ల వైవాహిక జీవితంలోని సరదా విషయాలను పంచుకున్నారు.