తెలుగుదేశం పార్టీ ఆ మధ్య కొన్ని జంబో కమిటీలను ప్రకటించింది. పదమూడు జిల్లాల ఆ పార్టీ ఏకంగా ఐదారు మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమించుకుంది! పార్టీ జాతీయాధ్యక్షుడుగా చంద్రబాబు, ఐదారు మంది జాతీయ ఉపాధ్యక్షులు, మరో అరడజను మంది జాతీయ కార్యదర్శులు.. ఇలా అంతా జాతీయ స్థాయి నియామకాలే చేపట్టింది తెలుగుదేశం పార్టీ.
ఆపై రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు..వీళ్లంతా బోలెడంత మంది! అంత పెద్ద పెద్ద కమిటీలు వేసినా .. కొంత మందికి అప్పట్లో పదవులు దక్కలేదు. ఆ లోటు ఇప్పుడు పూడ్చినట్టుగా ఉన్నారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ నియామకాలను ప్రకటించింది. ఈ ప్రకటనల్లో పార్టీలో ఉన్నారో లేరో తెలియని వారిని కూడా వదలకుండా అందరికీ తలా ఒక హోదా ఇచ్చేశారు. ఏకంగా 219 మందికి కొత్తగా వివిధ హోదాలను ఇచ్చారట ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.
ఇది వరకూ ప్రకటించిన కమిటీల్లో యాభై అరవై మంది ఉన్నట్టున్నారు. స్థూలంగా మూడు వందల మందికి పార్టీ పదవులు దక్కాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్ర పార్టీ ఏకంగా మూడొందల మందికి పార్టీ పదవులు ఇచ్చిందంటే గ్రేటే!
తాజాగా టీడీపీ ఉపాధ్యక్ష, కార్యదర్శి, తదితర పదవులను పొందిన నేతల్లో.. చాలా మంది రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించని వారు ఉండటం గమనార్హం. జనాల్లో కనిపించి చాలా కాలం అయిపోయిన నేతలను కూడా టీడీపీ ఉపాధ్యక్షులుగా నియమించేసినట్టుగా ఉన్నారు.
తొలి నియామకాల్లో స్థానం దక్కని భూమా అఖిలప్రియకూ, సుజయ కృష్ణ రంగారావులకు ఇప్పుడు ఎట్టకేలకూ స్థానం ఇచ్చి ఊరటనిచ్చినట్టుగా ఉన్నారు.