అడుసు తొక్కనేల కాలు కడగనేల….

అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెత చందాన న‌టుడు సిద్ధార్థ్ వ్య‌వ‌హార శైలి ఉంది. భార‌త్ బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్‌పై ట్విట‌ర్ వేదిక‌గా అవాకులు చెవాకులు పేలి…చివ‌రికి త‌ప్పైంది, క్ష‌మించాల‌ని వేడుకోవ‌డం…

అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెత చందాన న‌టుడు సిద్ధార్థ్ వ్య‌వ‌హార శైలి ఉంది. భార‌త్ బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్‌పై ట్విట‌ర్ వేదిక‌గా అవాకులు చెవాకులు పేలి…చివ‌రికి త‌ప్పైంది, క్ష‌మించాల‌ని వేడుకోవ‌డం గ‌మ‌నార్హం. సెల‌బ్రిటీల‌పై ఏదో ఒక వివాదాస్ప‌ద కామెంట్‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిల‌వొచ్చ‌నే చిల్ల‌ర ప్ర‌చార పిచ్చి ఉన్న వాళ్లు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌య్యారు.

ఈ జాబితాలోకి న‌టుడు సిద్ధార్థ్ కూడా చేరారనే విమ‌ర్శ‌లున్నాయి. బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్‌పై ట్విట‌ర్ వేదిక‌గా అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వెల్లువెత్తింది. దీంతో సిద్ధార్థ్ దిగిరాక త‌ప్ప‌లేదు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భ‌ద్ర‌తా వైఫ‌ల్యం గురించి తెలిసిందే. దీనిపై సైనా స్పందిస్తూ…'ఒక దేశ ప్ర‌ధానికే భ‌ద్ర‌త లేక‌పోతే , ఇక  ఆ దేశం భ‌ద్రంగా ఉంద‌ని ఎలా భావించ‌గ‌లం?  ప్ర‌ధాని మోదీపై అరాచ‌క‌వాదుల పిరికిపంద చ‌ర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్నా' అని ఆమె ట్వీట్ చేశారు.

దీన్ని న‌టుడు సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ…. 'చిన్న‌కాక్‌తో ఆడే ప్ర‌పంచ చాంపియ‌న్…! దేవుడా ధ‌న్య‌వాదాలు. భార‌త్‌ను కాపాడ‌డానికి కొంద‌రు ర‌క్ష‌కులున్నారు' అని వ్యంగ్యాన్ని ద‌ట్టించి త‌న శాడిజాన్ని ప్ర‌ద‌ర్శించారు. సిద్ధార్థ్ ట్వీట్‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌తో పాటు వివిధ మ‌హిళా సంఘాలు, ప్ర‌జాప్ర‌తినిధులు ధ్వ‌జ‌మెత్తారు. అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తాయి.

ఈ నేప‌థ్యంలో న‌టుడు సిద్ధార్థ్ ఎట్ట‌కేల‌కు త‌న త‌ప్పును తెలుసుకున్నారు. ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మే కాదు… నువ్వె ప్పుడూ త‌న చాంపియ‌న్‌గా ఉంటావ‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌డం విశేషం.  ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. సిద్ధార్థ్ తాజా క్ష‌మాప‌ణ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

'డియర్‌ సైనా..మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపర‌చాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలంటే నాకెంతో గౌరవం. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా. నువ్వెప్పుడూ నా చాంపియ‌న్‌గా ఉంటావు సైనా ' అంటూ ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇంత‌టితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్టే అని భావించొచ్చు.