పుట్టిన మూలాల్ని మరిచిపోవడం, ఎక్కడి నుంచి వచ్చామో విస్మరించడం, చేయూతనిచ్చిన వారిని నిరాదరించడం…ఇలాంటి లక్షణాలున్న వారిని ఎమనొచ్చు? సర్వభ్రష్టత్వం పొందినవాళ్లనొచ్చు.
తెదేపా ఎక్కడ పుట్టింది?.. సినిమా నేపథ్యం నుంచే కదా?
ఎవరు దన్నుగా నిలిచారు?.. సినిమావాళ్లే కదా?
ఎవరి ఎదుగుదలకు పాటుపడింది?.. సినిమావాళ్ల కోసమే కదా?
చంద్రబాబు హాయాములో ఎంతమంది సినిమావాళ్లకి భూములు ధారాదత్తం జరిగింది?
“అయినవాడు” కనుకనే కదా ప్రసాద్ మల్టీప్లెక్స్ కోసం అతి తక్కువ ధరలో ప్రైం లొకేషన్లో అంత భూమి కట్టబెట్టింది.
“కావాల్సినవాడు” కాబట్టే కదా మురళీమోహన్ కి జయభేరి మోగించడానికి వెన్నుదన్నుగా నిలిచింది.
“సొంతవాడు” అనే కదా రామానాయుడు కుటుంబానికి స్టూడియోలు కట్టుకోమని విశాఖ దగ్గర భూములిచ్చింది?
“అస్మదీయులు” అనే కదా బోయపాటిని, రాజమౌళిని అమరావతి గ్రాఫిక్స్ కి వాడుకున్నది.
“తనవాడు” అనే కదా కే. రాఘవేంద్రరావుకి సినీమ్యాక్స్ కట్టుకోవడానికి అంత భూమిచ్చింది.
ఇన్నేసి సినిమా లింకులు పెట్టుకుని ఏమీ ఎరగనట్టు, సినిమా పరిశ్రమ వివాదంలోకి తెలుగుదేశం పార్టీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.
అంతేకాకుండా సినిమా పరిశ్రమ తనకేమి సహకరించలేదని ఆయన బుంగమూతి పెట్టారు. తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని కూడా బాధపడ్డారు. ఇప్పుడు కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని, అయినా కూడా తానేమీ పట్టించుకోలేదని పిసుక్కున్నారు.
“సినిమాలు” అని బహువచనం వాడారు కానీ తన మీద తీసిన ఒకే ఒక్క సినిమా “లక్ష్మీస్ ఎన్.టి.ఆర్”.
మరెందుకు ఆ సినిమాని ఆంధ్రప్రదేశులో విడుదలకాకుండా అడ్డుపడినట్టు?
అదే సమయంలో కాస్త అటు ఇటుగా “ఎన్.టి.ఆర్. కథానాయకుడు- మహానాయకుడు” సినిమా వస్తే దానిని తన కార్యకర్తలకి టార్గెట్లిచ్చి మరీ అందరికీ చూపించమని ఎందుకు వెంపర్లాడినట్టు? అందులో తన పాత్రని హీరోలా చూపించారనేగా?!
సినిమా పరిశ్రమకి తన పార్టీకి సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారంటే ఆయనకి మతిమరుపు వ్యాధైనా వచ్చుండాలి, లేకపోతే మతిభ్రమించుండాలి.
ఇదిలా ఉంటే తాజాగా ఈయనగారు మరొక అద్భుతమైన స్టేట్మెంటిచ్చారు ఇవాళ- “ఒక బ్యాంకుని మోసం చేసారని అవినీతి కేసులు పెడుతున్నారు. ఒక్కొక్కొసారి ఒక్కొక్కొ బ్యాంక్ డబ్బులు తీసుకుని పరిస్థితులు కలిసిరాకపోవడం వల్ల కంపెనీలు సిక్ అయ్యే పరిస్థితి వస్తోంది”.. ఇలా సాగింది వారి ప్రసంగం. దీని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ అందుకుంది.
అసలేం మాట్లాడుతున్నాడో ఆయనకన్నా తెలుస్తోందా? బ్యాంకుని మోసం చేస్తే కేసులు పెట్టేస్తారా అని అడుగుతున్నాడంటే ఆయనకేమయ్యిందా అనిపిస్తోంది.
ఎన్నికల ప్రచారానికి వెళ్లి ప్రజల్ని తిట్టడం, ప్రతిపక్షం వాళ్లు ఏదో అన్నారని ప్రెస్మీట్లో గుక్కపెట్టి ఏడవడం, బ్యాంకుల్ని మోసం చేసినంతనే కేసులు పెట్టేస్తారా అని వాపోవడం, తన పార్టీకి సినిమారంగానికి ఏమీ సంబంధం లేదనడం…ఇవన్నీ చూస్తుంటే బాబుగారి మానసిక పరిస్థితి మీద అనుమానమొస్తోంది. ఈ తిక్కమాటలకి కోపం రాకపోగా జాలేస్తోంది.
– హరగోపాల్ సూరపనేని