ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖ పర్యటన తొందరలోనే ఉందా అంటే అవును అంటున్నారు. ఆయన వచ్చే నెలలో విశాఖ పర్యటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖలోని పెందుర్తి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11 వరకూ ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు. దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు.ఇదిలా ఉంటే జగన్ సీఎం అయిన కొత్తలో శారదాపీఠానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
గత ఏడాది కూడా ఆయన వార్షికోత్సవాలకు హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది సైతం జగన్ శారదా పీఠానికి రావచ్చు అని చెబుతున్నారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద్రేంద్ర ముఖ్యమంత్రి జగన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కలసి ఈ మేరకు ఆహ్వానం అందచేశారు.
దాంతో జగన్ విశాఖ పర్యటనకు రావచ్చు అంటున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి జగన్ శంఖుస్థాపన చేస్తారని, మరి కొన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో జగన్ విశాఖ రావడం ఇదే తొలిసారి అవుతుంది అంటున్నారు.