గెలిస్తే త‌న వ‌ల్లే.. ఓడితే అంద‌రి పేర్లూ చెబుతారు!

త‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లోనూ ఏనాడూ సొంత బ‌లంతో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తీసుకురాలేని చంద్ర‌బాబు నాయుడు, త‌న ఓట‌ముల‌కు ఇత‌రుల‌ను నిందించ‌డాన్ని ఆప‌డం లేదు. కుప్పం వెళితే .. మీరే పార్టీని ఓడించారంటూ అక్క‌డ…

త‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లోనూ ఏనాడూ సొంత బ‌లంతో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తీసుకురాలేని చంద్ర‌బాబు నాయుడు, త‌న ఓట‌ముల‌కు ఇత‌రుల‌ను నిందించ‌డాన్ని ఆప‌డం లేదు. కుప్పం వెళితే .. మీరే పార్టీని ఓడించారంటూ అక్క‌డ సామాన్య కార్య‌క‌ర్త‌ల‌ను తిట్టారు. త‌న పేరు చూపి పార్టీని గెలిపించుకోవాల్సిన చంద్ర‌బాబు నాయుడు, త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఓడితే దానికంతా కార‌ణం వీధుల్లో తిరిగే కార్య‌క‌ర్త‌లే అని తేల్చారు. 

కుప్పంలో మెజారిటీలు వ‌ర‌స‌గా త‌రిగిపోతూ ఉండ‌టానికి కానీ, కుప్పం మున్సిపాలిటీలో పార్టీ ఓట‌మికి కానీ.. త‌ను ఎంత మాత్రం కార‌ణం కాద‌న్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు చెప్పుకున్నారు! ఆఖ‌రికి త‌ను ఎమ్మెల్యేగా ఉన్న నియోజ‌వ‌క‌ర్గంలో పార్టీ జ‌యాప‌జ‌యాలకు బాధ్య‌త వ‌హించ‌లేని త‌న చేత‌గాని త‌త్వాన్ని చంద్ర‌బాబు అలా చాటుకున్నారు.

అదే గెలిచిన సంద‌ర్భాల్లో మాత్రం చంద్ర‌బాబు నాయుడు అంతా త‌న వ‌ల్లే అని చెప్పుకుంటారు. త‌ను 14 యేళ్ల సీఎం అని రోజూ గ‌ప్ఫాలు కొట్టుకుంటూ ఉంటారు. మ‌రి ఆ ప‌ద్నాలుగు ఏళ్లూ ఎలా సీఎంగా కొన‌సాగారు? తొలి ఐదేళ్లూ ఎన్టీఆర్ ఖాతాలోని సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు వెన్నుపోటు వేసి ఈయ‌న సీఎం. రెండో ఐదేళ్లూ బీజేపీ ఊపు ద్వారా ద‌క్కిన‌వి. బీజేపీతో పొత్తు లేక‌పోతే 1999లోనే చంద్ర‌బాబు చ‌రిత్ర చిరిగిపోయేది. 

ఇక 2014 విజ‌యం మ‌ళ్లీ బీజేపీకి వ‌చ్చిన ఊపు, ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హ‌కారం వ‌ల్ల ద‌క్కింది. ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు నాయుడు సాంకేతికంగా ఒంట‌రిగా పోటీ చేసింది 2019 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే. అప్పుడు ఆయ‌న సీను 23 సీట్ల స్థాయి అని తేలిపోయింది.

మ‌రి ఇంత చ‌రిత్ర‌ను మ‌రుగున ప‌రుస్తూ.. 14 యేళ్ల పాటు సీఎం అని చెప్పుకోవ‌డం, ఓడిపోయిన సంద‌ర్భాల గురించి చెబుతూ.. చిరంజీవి పార్టీ వ‌ల్ల ఓడిపోయా.. అంటూ ఇంకా క‌హానీలు చెప్పి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నారు. చంద్ర‌బాబు వీరాభిమానుల‌కూ, ఆయ‌న స్వ‌కుల‌స్తుల‌కూ.. స్వకుచ‌మ‌ర్ధ‌నం స‌మ్మ‌గానే ఉండ‌వ‌చ్చు కానీ… ఈ మాట‌ల‌తో చంద్ర‌బాబు నాయుడు త‌న  పొలిటిక‌ల్ కెరీర్ ఎండాఫ్ స్టేజీలో ప్ర‌హ‌స‌నం పాల‌వుతున్నారు!