ఆల‌స్యంగా అయినా…రాహుల్‌కు అచ్చెన్న మ‌ద్ద‌తు!

కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా త‌ప్పు ప‌డుతున్నారు. బీజేపీ చ‌ర్య‌ల‌తో రాహుల్‌గాంధీ రాత్రికి రాత్రే హీరో అయ్యారు. రాహుల్‌పై చ‌ర్య‌కు నిర‌స‌న‌గా విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి…

కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా త‌ప్పు ప‌డుతున్నారు. బీజేపీ చ‌ర్య‌ల‌తో రాహుల్‌గాంధీ రాత్రికి రాత్రే హీరో అయ్యారు. రాహుల్‌పై చ‌ర్య‌కు నిర‌స‌న‌గా విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. న‌ల్ల రిబ్బ‌న్లు క‌ట్టుకుని అత్యున్న‌త చ‌ట్ట స‌భలో విప‌క్షాలు నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. రాహుల్‌గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌డాన్ని బీఆర్ఎస్ సైతం వ్య‌తిరేకించింది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటు చేస్తాన‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన సంగ‌తి తెలిసింది. రాజ‌కీయంగా కాంగ్రెస్‌తో విభేదిస్తున్న‌ప్ప‌టికీ, రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు విష‌యంలో బీఆర్ఎస్ విప‌క్షాల‌తో గొంతు క‌లిపింది. ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల నేత‌లెవ‌రూ నోరు మెద‌ప‌లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఏపీలో పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ బీజేపీకి బీ టీమ్‌గా మారాయ‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. బీజేపీ ఎంత అప్ర‌జాస్వామిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నా ఏపీలో ప్ర‌శ్నించే, నిల‌దీసే పార్టీలేవీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు త‌ప్ప ప‌ట్ట‌డం విశేషం.

ఆల‌స్యంగా అయినా రాహుల్‌కు జ‌రిగిన అన్యాయంపై బీజేపీ వైఖ‌రిని అచ్చెన్నాయుడు త‌ప్పు ప‌ట్ట‌డాన్ని ప‌లువురు ప్ర‌జాస్వామికవాదులు అభినందిస్తున్నారు. క‌నీసం ఆ మాత్రం ధైర్యం చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు వారు చెబుతున్నారు. పొలిట్‌బ్యూరో స‌మావేశం అనంత‌రం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌కు సమ‌యం ఇవ్వ‌కుండా అన‌ర్హ‌త వేటు వేయ‌డం త‌ప్పు అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జాతీయ స్థాయిలో బీజేపీ కూట‌మిని ఓడించేందుకు కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు జ‌త క‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం, ఘోర ప‌రాజ‌యం చెంద‌డం అంద‌రికీ విధిత‌మే. కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌ధాని మోదీ, అమిత్‌షాల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ త‌ర్వాత ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కేంద్రంలో మ‌ళ్లీ మోదీ ప్ర‌భుత్వం ఏర్పాటైంది. అప్ప‌టి నుంచి మోదీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు చంద్ర‌బాబు ధైర్యం చేయ‌డం లేదు. తాజాగా రాహుల్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌డం టీడీపీది సాహ‌స‌మనే చెప్పాలి.