ఏపీ స‌ర్కార్ వేడుకోలు… సుప్రీంకోర్టు ఊహూ!

రాజ‌ధాని అమ‌రావ‌తిపై త్వ‌ర‌గా విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏపీ స‌ర్కార్ విజ్ఞ‌ప్తిని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. అంతేకాదు, కేసు విచార‌ణ‌ను జూలై 11న చేప‌డ‌తామ‌ని చెప్ప‌డంతో స‌ర్కార్ తీవ్ర నిరాశ‌కు గురైంది. దీంతో విశాఖ కేంద్రంగా…

రాజ‌ధాని అమ‌రావ‌తిపై త్వ‌ర‌గా విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏపీ స‌ర్కార్ విజ్ఞ‌ప్తిని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. అంతేకాదు, కేసు విచార‌ణ‌ను జూలై 11న చేప‌డ‌తామ‌ని చెప్ప‌డంతో స‌ర్కార్ తీవ్ర నిరాశ‌కు గురైంది. దీంతో విశాఖ కేంద్రంగా త్వ‌ర‌గా ప‌రిపాల‌న మొద‌టి పెట్టాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఏపీ స‌ర్కార్ ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది. రాజ‌ధాని అంశంపై ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ఏపీ హైకోర్టులో వ్య‌తిరేక తీర్పు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

మూడు రాజ‌ధానుల బిల్లుల్ని వెన‌క్కి తీసుకున్న త‌ర్వాత ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వ‌డంపై అసెంబ్లీలో చ‌ర్చ‌కు కూడా పెట్టారు. అనంత‌రం ఏపీ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని ప‌లు అంశాల‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే తీర్పు మొత్తంపై స్టే ఇవ్వాల‌ని ఇవాళ మ‌రోసారి ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టును అభ్య‌ర్థించారు. ఇందుకు మ‌రోసారి సుప్రీంకోర్టు అంగీక‌రించ‌లేదు.

అలాగే అమ‌రావ‌తి రాజ‌ధాని అంశంపై త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదుల విన్న‌పాన్ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ కేఎం జోస‌ఫ్‌, జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. ఒక కేసును విచారిస్తుండ‌గా, మ‌ధ్య‌లో మ‌రో కేసు ఎలా విచారించాల‌ని  జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. జస్టిస్ కేఎం జోసెఫ్ జూన్ 16న పదవీ విరమణ చేయనున్నారు.

అందుకే కేసు విచారణను జూలైకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో అమరావతిపై వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని జ‌స్టిస్‌ జోసెఫ్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఏది ఏమైనా దాదాపు మూడున్న‌ర నెల‌ల పాటు అమ‌రావ‌తి కేసు వాయిదా ప‌డ‌డం ఏపీ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు.