ప‌వ‌న్‌తో బాబు పొత్తాట‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు టీడీపీ తీవ్ర నిరాశ మిగిల్చింది. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం టీడీపీ పొలిట్‌బ్యూరో స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పొత్తుల‌పై క్లారిటీ వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చావు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు టీడీపీ తీవ్ర నిరాశ మిగిల్చింది. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం టీడీపీ పొలిట్‌బ్యూరో స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పొత్తుల‌పై క్లారిటీ వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. స‌మావేశంలో పొత్తుల గురించి చ‌ర్చించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే పొత్తుల‌పై మాట్లాడ్తామన్నారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌న్నారు.

రాష్ట్రంలో, దేశంలో ప‌లుమార్లు పొత్తులు పెట్టుకున్న‌ట్టు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌లిసొచ్చే పార్టీల‌తో పొత్తుల విష‌య‌మై ఆలోచిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల్ని జ‌న‌సేన జీర్ణించుకోలేక‌పోతోంది. నిజానికి జ‌న‌సేన‌తో పొత్తు వ‌ద్ద‌ని టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. పొత్తుతో సంబంధం లేకుండానే అధికారంలోకి వ‌చ్చేంత సానుకూల‌త టీడీపీపై ప్ర‌జ‌ల్లో ఉంద‌ని ఆ పార్టీ న‌మ్మ‌కం.

మ‌రోవైపు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం మాని, టీడీపీ నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు టీడీపీతో పొత్తు కోసం నేరుగానే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా, అటు వైపు నుంచి రెడ్ సిగ్న‌లే క‌నిపిస్తోంది. దీంతో అడుగులు ఎలా వేయాలో జ‌న‌సేనానికి దిక్కు తోచ‌డం లేదు. జ‌న‌సేన‌తో సంబంధం లేకుండానే టీడీపీ అభ్య‌ర్థుల ఖ‌రారు చేయ‌డంపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

ఇలా చివ‌రి వ‌ర‌కూ  నాన్చివేత ప్ర‌ద‌ర్శిస్తే… భారీగా న‌ష్ట‌పోతామ‌నే ఆందోళ‌న జ‌న‌సేన నేత‌ల్లో వుంది. జ‌న‌సేన ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తున్న కొద్ది టీడీపీ మ‌రింత జాప్యం క‌న‌బ‌రుస్తోంది. ఎందుకంటే ప‌వ‌న్ త‌న‌కు తానుగా త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే… డిమాండ్ చేసే హ‌క్కు కోల్పోతాడ‌ని చంద్ర‌బాబు వ్యూహం. త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో ప‌వ‌న్‌ను కేవ‌లం 15 నుంచి 25 సీట్ల లోపు మాత్ర‌మే పోటీ చేసేలా ఒప్పించేందుకే పొత్తు ఆట చంద్ర‌బాబు ఆడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అస‌లు చంద్ర‌బాబు మ‌న‌సులో ఏముందో అర్థం కాక‌పోవ‌డం, మ‌రోవైపు చివ‌రికి భిక్షం విదిల్చిన చందంగా…బాబుకు తోసిన‌న్ని సీట్లు ఇస్తారేమో అని ప‌వ‌న్ క‌ల‌వ‌ర‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు పొత్తాట‌లో ప‌వ‌న్ ఏమ‌వుతారనేది భ‌విష్య‌త్ తేల్చ‌నుంది.