వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీకి దిక్కా?

న‌లుగురు కాదు, 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత మొద‌లుకుని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి వ‌ర‌కూ ఒక‌టే నినాదం. అధికార పార్టీ నుంచి…

న‌లుగురు కాదు, 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత మొద‌లుకుని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి వ‌ర‌కూ ఒక‌టే నినాదం. అధికార పార్టీ నుంచి త‌మ పార్టీలోకి వ‌స్తామ‌ని పెద్ద సంఖ్య‌లో ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నార‌ని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నార‌ని చెప్పుకోడానికి ఈ మాటలు చెబుతుండొచ్చేమో కానీ, మ‌రో కీల‌క అంశాన్ని టీడీపీ నేత‌లు విస్మ‌రించారు.

వైసీపీ నుంచి వ‌స్తే త‌ప్ప పోటీ చేయ‌డానికి టీడీపీకి నాయ‌కులు లేరా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. టీడీపీ మ‌రీ ఇంత అధ్వానంగా ఉందా? అనే అనుమానం క‌లిగిస్తోంది. టీడీపీలో నాయ‌కులే ఉంటే, ప‌క్క పార్టీ నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆ పార్టీకి ఎందుకొచ్చింద‌నే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. అనిత‌, అచ్చెన్నాయుడు, త‌దిత‌ర టీడీపీ నేత‌ల గొప్ప‌లు, చివ‌రికి ఆ పార్టీ డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట పెడుతున్నాయి.

టీడీపీలో మంచి లీడ‌ర్స్ వుంటే వైసీపీ నుంచి వ‌చ్చే ఎమ్మెల్యేల కోసం ఎందుకు ఎదురు చూస్తున్న‌ట్టు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. వైసీపీ నుంచి భారీగా ఎమ్మెల్యేలు వ‌స్తే, ఆల్రెడీ త‌మ పార్టీలో ఉన్న నాయ‌కుల్ని ఏం చేయాల‌ని అనుకుంటున్నార‌నే నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు సీఎం జ‌గ‌న్ ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అక్క‌డ కొత్త అభ్య‌ర్థిని నిల‌బెట్టే అవ‌కాశాలున్నాయి.

టీడీపీలోకి గొల్ల బాబురావు వెళ్తార‌నుకుందాం. అప్పుడు టికెట్ ఆయ‌న‌కు ఇస్తారా? మ‌రి ఆ టికెట్ ఆశిస్తున్న త‌న ప‌రిస్థితి ఏంటో వంగ‌ల‌పూడి అనిత స‌మాధానం చెప్పాలి. పాయ‌క‌రావుపేట టికెట్ అనిత‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సైతం సిద్ధంగా లేర‌నే సంగ‌తి తెలిసిందే. వంగ‌ల‌పూడి అనిత పేరు చెబితే… పాయ‌క‌రావుపేట టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌యంతో ప‌రుగులు తీసే ప‌రిస్థితి. అనిత ప్లేస్‌లో మ‌రెవ‌రైనా స‌రే అని స‌ర్దుకుపోవ‌డానికి టీడీపీ శ్రేణులున్నాయ‌ని స‌మాచారం.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ద్ద‌నుకున్నోళ్లంద‌రినీ చేర‌దీసే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారా? గెలుపు గుర్రాల కాద‌నుకుని జ‌గ‌న్ టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రిస్తుంటే, ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయార‌ని భావిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను తీసుకుని చంద్ర‌బాబు ఏం సాధిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం  అధికార పార్టీ బ‌ల‌హీన‌త సంగ‌తి ప‌క్క‌న పెడితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ద‌య‌నీయ స్థితిని ప్ర‌తిబింబిస్తోంది.